Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదలతో ముందుగా ముంపునకు గురయ్యే ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంగళవారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు గోదావరి పరివాహక గ్రామాలైన ఎం.కాశీనగరం, సున్నం బట్టిలతోపాటు వర్క్ షాప్ ఎల్ఎన్ రావు పేట గ్రామాలు పూర్తిగా ముంపుకు గురికాగా సున్నం బట్టి, ఎం.కాశీనగరం గ్రామాల్లో ఇల్లు కూలి పోయాయి. దీంతో ఆ గ్రామస్తులు మాకు ఈ గ్రామమే వద్దంటూ మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వరద ప్రాంతాల్లో పరిశీలనకు వచ్చిన సందర్భంలో మంత్రి పువ్వాడ అజరుని, కలెక్టర్ అనుదీప్‌ని వేడుకున్నారు. దీంతో మంత్రి ఆదేశాలతో సున్నం బట్టి గ్రామస్తులకు సురక్షిత ప్రదేశంలో ఇల్లు నిర్మాణం చేపట్టి ఇచ్చేందుకు కలెక్టర్ అనుదీప్ మంగళవారం రామచంద్రపురం గ్రామంలో గతంలో బృహత్తర పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం అధికారులు గుర్తించిన ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మండల లైబ్రరీ భవన నిర్మాణం కోసం దుమ్మగూడెం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన ఆయన రెండు కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన క్రీడామైదానం కోసం ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న మైదానంని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం గోదావరి భారీ వరదల సమయంలో దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి కరకట్ట బలహీనపడిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించిన ప్రభుత్వ స్థలాలను మార్కింగ్ చేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.