Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం రూ.10 వేలు వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం మంగళవారం ఎం.రేణుక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మచ్చా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వరద ముంపు నష్టపరిహారాన్ని వెంటనే వరద బాధితులకు అందించాలని అన్నారు. ఉన్నతాధికారులు వరద ముంపు నష్టాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అంచనా వేయాలని పూర్తిగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. భద్రాచలం కరకట్ట ఎత్తు పెంచి పొడిగించే దానికి కావలసిన తక్షణ చర్యలు వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం అంశంతో పాటు ఐదు పంచాయతీల సమస్య విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయ కోణంలో ఆలోచించకుండా ప్రజల కోరిక మేరకు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు సహాయం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, నాదెళ్ల లీలావతి, కమిటీ సభ్యులు బి.కుసుమ, యు.జ్యోతి, నాగరాజు, జీవనజ్యోతి, ఎస్.రామకృష్ణ, కే.శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, లక్ష్మీకాంత్, కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.