Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరం కడితే ముంపు తప్పదని సీపీఐ(ఎం) ఆనాడే చెప్పింది
- భద్రాచలం రక్షణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కలవాలి
- ముంపుకు గురైన వారికి రూ.1లక్ష పరిహారం చెల్లించాలి
- మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాచలం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, ముందు జాగ్రతలు తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన కలెక్టర్, ఎస్పీ, అన్ని రంగాల అధికార యంత్రాంగానికి, అనధికారులకు, పారిశుధ్య సిబ్బందికి సీపీఐ(ఎం) తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బుధవారం కొత్తగూడెం మంచికంటి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రాచలం సమీపంలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని, పోలవరం కడితే ముంపు తప్పదని సీపీఐ(ఎం) ఆనాడే చెప్పిందని, భద్రాచలం రక్షణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమై, దేశ ప్రధానిని కలసి గోదావరి ముంపు ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రపై ఒత్తిడి తేవాలని, ముంపుకు గురైన ఒక్కో ఇంటికి రూ.1లక్ష పరిహారం వెంటనే చెల్లించాలని, ముంపు ప్రాంతాల్లోన్ని బాధితులకు పార్టీలకు అతీతంగా సహాయం అందించాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.వెయ్యి కోట్ల నిధులతో వెంటనే కరకట్టపెంచేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కనకయ్య డిమాండ్ చేశారు. పోలవరం ముంపు వలన భద్రాచలం, పినపాక నియోజక వర్గాలలోని సుమారు 90 గ్రామాలు నీట మునుగాయి అన్నారు. ఈ ముంపు బారి నుండి ప్రజలను కొంతైనా రక్షించటం కోసం భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెంలను తెలంగాణా భద్రాచలంలో కలపాలని సీపీఐ(ఎం) కోరుతుందన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు ఆంధ్రా, తెలంగాణ రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2006లో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలలో 650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమస్యపై 2007 లోనే సీపీఐ(ఎం) పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, డిజైన్ మార్చాలని సీపీఐ(ఎం) ఉద్యమం చేసిందన్నారు. ఆనాడు పోలీస్ కాల్పులు జరిపారని, 89 మంది ప్రజాప్రతినిధులు, నాయకులపై కేసులు నమోదు చేశారని, ఇప్పటికీ తమ కార్యకర్తలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ ఉద్యమం తీసుకోవటం శుభ పరిణామం సీపీఐ(ఎం) ఈ ఉద్యమంలో సంపూర్ణంగా పాల్గొంటుందని తెపారు. జిల్లాలో వరద బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు జాప్యం లేకుండా అమలు చేయాలన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. పంట నష్టరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని, వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం ఇంతవరకు ఇవ్వలేదని, రెండు నెలల పాటు 20 కేజీల బియ్యం, 5 కేజీల పప్పు అందరికీ అందలేదని, అవి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యం వరదల బారిన పడుతున్న ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన హామీలను ఆచరణలో నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల అభివృద్దికి రూ.1000 కోట్లు వాగ్దానం కూడా జాప్యం లేకుండా వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. వరదల వలన నష్ట పోయిన పంటను అంచనా వేసి ఎకరాకు కనీసం రూ.25వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, లేదంటే రానున్న కాలంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారయణ, జిల్లా కమిటీ సభ్యులు రెపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.