Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆభరణాలను స్వాధీనం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... భద్రాచలం పట్టణము, జిల్లాలో కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందిన వెంటనే అప్రమత్తమయిన పోలీసులు వాటిపై సమగ్ర విచారణ నిర్వహించి సోమవారం భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టాగా పట్టణానికి చెందిన కోడి శేఖర్, దుమ్ముగూడెంకి చెందిన పూజారి సూర్యప్రకాష్, బుట్టాయిగూడెంకి చెందిన వాసం మనోహర్, తుమ్మలగూడెంకి చెందిన సోయం నవీన్, సారపాకకి చెందిన వాంకుడోత్ సాయి కుమార్‌లు దొంగిలించిన వస్తువులను, బంగారాన్ని, వెండిని కొత్తగూడెంలో అమ్మడానికి వెళ్తుండగా నమ్మదగిన సమాచారంతో పోలీసులు పట్టుకోవడం జరిగిందని ఏఎస్పి తెలిపారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారాన్ని, 630 గ్రాముల వెండిని, ఒక టీవీఎస్ మోటార్ సైకిల్ ,ఒక యాపిల్ ఐఫోన్‌ను స్వాధీనము చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. వీరందరూ మద్యానికి బానిసై చెడు తిరుగుళ్ళకు, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం అలవరచుకున్నారని పేర్కొన్నారు. ఎవ్వరూ లేని ఇళ్లను ఎంచుకుని దగ్గరలో ఉన్న గడ్డపారలతో తాళాలు పగులకొట్టి లేదా తలుపులకి నిప్పు పెట్టి లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారము, వెండి, ఫోన్లు, మోటార్ సైకిల్లు, ఇతర వస్తువులను దొంగిలించారని ఎఎస్పి వెల్లడించారు. వీళ్ళు భద్రాచలం పట్టణము, బూర్గంపాడు, పాల్వంచ పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 దొంగతనాల కేసులలో నిందితులుగా ఉన్నట్లు విచారణలో తెలిందని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు ఏఎస్పి తెలిపారు. నిందితు లను చాకచక్యంగా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్లు సూర్యారావ్, శంకర్, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, శంకర్, హౌమ్ గార్డ్ ఓదేలు, భద్రాచల పట్టణ పోలీసు సిబ్బందిని, ఫింగర్ ప్రింట్, ఐటి కోర్ విబాగాలను భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజు అభినందించారు.