Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండవ రోజు..అదే జోరు కొనసాగిన తీరు
- ప్రధాన కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా
- జోలెపట్టి వినూత్నరీతిలో నిరసన
- 13న చలో అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సంస్థ సీఅడ్ఎండి శ్రీధర్ వివక్షత ప్రదర్శిస్తున్నారని, క్రమబద్దీకరణ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా, సమాన పనికి సమానవేతనం చెల్లిస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయకుండా కార్మికులకు తీరని అన్యాయం చేశారు. హైపర్ కమిటీ వేతనాలు అమలు, క్రమబద్దీకరణ, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె శనివారం రెండో రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జోలెపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సంఖ్యలతో సహా ప్రకటించిన ముఖ్యమంత్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికులను విస్మరించి వివక్షత ప్రదర్శించాడని ఆరోపించారు. సింగరేణి వ్యాపితంగా సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి, లాభాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఎన్నికల సమయంలో, తర్వాత పలుమార్లు సింగరేణి కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. సమ్మె నోటీసుపై జరిగిన చర్చల్లో వేతనాలు పెంచుతామని కార్మిక శాఖ అధికారి ముందు హామీ ఇచ్చిన యాజమాన్యం ఎనిమిది నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం సరైందికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికులు సమ్మెబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ, సింగరేణి ప్రైవేటీకరణకు స్వస్థి చెప్పాలని లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని అన్నారు. కార్మికుల పోరాటానికి, సమ్మె ఉద్యమానికి ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే ప్రజలను భాగస్వామ్యం చేసి కోల్ బెల్ట్ ప్రాంతాల ఉద్యమంగా సమ్మెను మలుస్తామని హెచ్చరించారు. ఈ నెల 13న ఛలో అసెంబ్లీ ముట్టడికి కార్మికులు అదికసంఖ్యలో హాజర్తె ఈ ప్రభుత్వాని కళ్లు తెరిపించాలని అనారు. ధర్నాలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, పి.సతీష్, కాలం నాగభూషనం, ఎల్.విశ్వనాధం, కందగట్ల సురేందర్, ఇనపనూరి నాగేశ్వరరావు, జి.రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిట్టల రాంచందర్, డి.వీరన్న, వై.ఆంజనేయులు, ఎం.మల్లికార్జున్, డి.నిర్మల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం : ఈ సమ్మెకు సీపీఐ జిల్లా కార్యదర్శి యస్.కె.షాబిర్ పాష, జిల్లా నాయకులు నారాటి ప్రాసాద్, చంద్రగిరి శ్రీను మద్దతు తెలిపి మాట్లాడారు.
ఇల్లందు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో గత ఏడేండ్లుగా జీతాలు పెంచాలని వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సమ్మె బాట పట్టారని అన్నారు. శనివారానికి సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇల్లందులోని సింగరేణి జెకె ఫై ఓసిడి బ్లాక్ బెల్టు క్లీనింగ్, సెల్ పీకింగ్ రోడ్డు, క్లినింగ్ ఓసి సివిక్ జెకె సివిల్ సివిక్ మేషన్ కార్పెంటర్ గేస్ట్ హౌస్ 24 సివిక్ సివిల్ వాటర్ సప్లై స్టోర్ రైల్వేసైడింగ్ సీఎస్పీ రోడ్డు క్లీనింగ్ తదితర డిపార్ట్మెంట్ల కార్మికులు విధులు బహిష్కరించి అనంతరం ప్రదర్శనగా జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్మిక జేఏసీ నేతలు కే.సారయ్య, ఎస్ఏ నబి, డి.ప్రసాద్, రామ్ సింగ్, సారంగపాణిలు పాల్గొని మాట్లాడారు. వివిధ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి హామీలు అమలు కావట్లేదని, కేటీఆర్, కవిత, కోల్బెల్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ఎందుకు చెప్పించడం లేదన్నారు.
అనంతరం ఎస్ఓటు జీఎం బండి వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. అధ్యక్ష వర్గంగా షేక్ యాకుబ్ షావలి, దేవరకొండ శంకర్, తాళ్లూరి కృష్ణ, గౌని నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసు, జీవన్, సంజీవ్, కనకతారా, వెంకటభారు, మంద పద్మ, మంజు రఘు, చారీ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : కోయగూడెం ఓపెన్ కాస్ట్లో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండవ రోజు శనివారం విజయవంతమైంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జెఏసీ నాయకులు రేపాకుల శ్రీనివాస్, డి.ప్రసాద్, గుగులోత్ రాంచందర్, కోటిలింగం సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కోయగూడెం ఓసీ, సింగరేణి కాలనీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె రెండో రోజు సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడుదుల వీరన్న, ఐత శ్రీరాములు, భద్రయ్య, శివ, చారి తదితరులు పాల్గొన్నారు.