Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం భోజనం కార్మికుల యూనియన్
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. రమ పిలుపు
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలకు వ్యతిరేఖంగా సమరశీల పోరాటాలు చేసి, మధ్యాహ్న భోజనం పథకాన్ని రక్షించుకోవడమే ఐలమ్మ కిచ్చే నివాళి అని, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ అన్నారు. శనివారం మణుగూరులో శ్రామిక భవనంలో సంఘ జిల్లా అధ్యక్షులు జిలకర పద్మ, రామలక్ష్మి, శివమ్మ అధ్యక్ష వర్గంగా జరిగిన జిల్లా రెండవ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే భోజనాన్ని పెట్టే పనిని భారంగా భావిస్తున్నదన్నారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఆశా తదితర రంగాలలో పని చేసే కార్మికులను, ఈ పథకాలను ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పాలక ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన గౌరవ వేతనాన్ని నేటి వరకు అమలు చేయడం లేదన్నారు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనీ, ఆ మేరకు ఒక్కో విద్యార్థికి ఇచ్చే డబ్బులను పెంచడం లేదన్నారు. పెరిగే ధరలు ఒక పక్క, వేతన బకాయిలు మరో పక్క, బిల్లులు బకాయిలు ఇంకో పక్క మధ్యాహ్న భోజనం కార్మికులు ఎదుర్కొంటు న్నారన్నారు. పాలక ప్రభుత్వాలు ఉద్దేశ్య పూర్వకంగానే ఈ పథకాలను రద్దు చేసే చర్యలకు పూనుకోవడం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాక, పాఠశాలలకు వెళ్లలేని పరిస్తితి నెలకొంటున్న దన్నారు. ఈ మొత్తం సమస్యలపై రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాల రూపకల్పనకై అఖిల భారత మహాసభలను హైదరాబాద్లో నవంబర్లో నిర్వహిస్తున్నట్లు రమ తెలిపారు. గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు ప్రజా ఉద్యమాలలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి రమ పుల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ మహాసభ ప్రారంభ సూచికగా జెండాని సీనియర్ నాయకులు వెంకట నరసమ్మ ఆవిష్కరించారు. ఈ మహా సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్, ఉపాధ్యక్షులు బ్రహ్మచారి, గద్దల శ్రీనివాస్ రావు, నెల్లూరి నాగేశ్వర రావు, కొడిశాల రాములు, యు.నరసింహారావు, కాంతారావు, పాయం నరసింహారావు, ఈశ్వర్ రావు, నాగమణి, నాగలక్ష్మి, చిలకమ్మ, మద్యహ్న భోజన యూనియన్ నాయకులు చిలకమ్మ, సుల్తానా, అరుణ, సీత, చిన్నక్క, సమ్మక్క, రాణి తదితరులు పాల్గొన్నారు.