Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటశాల, డైనింగ్ స్టోర్ రూం పరిశీలించి
- సహపంక్తి భోజనం చేసిన మంత్రి
నవతెలంగాణ-ఖమ్మం
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ''స్వచ్ఛ గురుకుల్'' వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరం ఎన్ఎస్పి క్యాంపులోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో స్వచ్ఛ గురుకుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థినిలు మంత్రికి సాదర స్వగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో మరో 33 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా చేపట్టాలన్నారు. అనంతరం వంటశాల, డైనింగ్, స్టోర్ రూం ను మంత్రి పరిశీలించారు. విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, గురుకులాల జాయింట్ సెక్రటరీ శారద, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్సీవో ప్రత్యూష, ప్రిన్సిపాల్ చావా జ్యోతి, కార్పొరేటర్ శ్రీవిద్యా తదితరులు పాల్గొన్నారు.