Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గంలో 52,914 ఎకరాలకు నీళ్లు
- రూ.620.88 కోట్లు మంజూరు
- ఎమ్మెల్యే రాములు నాయక్ వెల్లడి
నవతెలంగాణ-వైరా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామా ప్రాజెక్ట్ పనులకు నిధులు మంజూరైనట్లు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తెలిపారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసాచార్యులు, అర్జున్‌లతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా వైరా నియోజక వర్గంలో 52,914 ఎకరాల ఆయకట్టుకు నీరు నిరంతరాయంగా అందుతుందని, వెనక బడిన గిరిజన నియోజక వర్గంలో ఇన్నేళ్లుగా రైతులు అనుభవించిన కష్టాలు తొలగనున్నాయని అన్నారు. వైరా నియోజక వర్గం జూలూరు పాడు మండలంలో 8వ ప్యాకేజీ కింద పూర్తి చేయనున్న పెండింగ్ పనులకు రూ.90.42 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇక్కడ ఒక ప్రధానమైన బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి వస్తోందని, దానితో పాటు 11.42 కిమీ పనులు పూర్తి చేయుటకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. 14 ప్యాకేజీలో 5.5 కి మీ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయుటకు, నడుస్తున్న పనులను వేగవంతం చేయుటకు 110 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. కొత్తగా పాలకొల్లు నుండి ఏనుకూరు మండలం బురద రాఘవాపురం వరకు 11.9 కి.మీ కాలువలు, కల్వర్టుల నిర్మాణాలకు 420.46 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. వైరా నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను పూర్తి చేయుటకు అవసరమైన నిధులు, వర్క్ ఆర్డర్లు మంజూరు చేయాలని ఈ నెల 6 వ తేదీన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరగా ఆయన ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ద్వారా అధికారులను ఆదేశించటంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే వ్యవసాయ సీజన్ జూన్ నాటికి పూర్తి స్థాయిలో సీతారామ ప్రాజెక్ట్ నీరు ఇచ్చేందుకు పనులు వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిఓ ఆర్ టి నెం 281 , తేదీ డి 09.09.2022 ద్వారా ఇంజినీర్ ఇన్ చీఫ్ హైదరాబాద్ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు అందిననట్లు వివరించారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మునిసిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, ఏఎంసి చైర్మన్ బిడికె రత్నం, రైతు బంధు వైరా మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, డిఈఈలు వెంకన్న, చంద్రశేఖర్, ఏఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.