Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత పరీక్ష నిర్వహణలొ లోపాలు
- ఆందోళన చేసిన అభ్యర్థులు
- మెడికల్ కాలేజీ ఆవరణ గందరగోళ పరిస్థితి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మెడికల్ కళాశాలలో (ఔట్సోర్సింగ్) పొరుగు సేవల ఉద్యోగాల కోసం నిర్వహించాల్సిన పరీక్షల ఏర్పాట్లతో గందర గోళ పరస్థితి ఏర్పడింది. పరీక్షల నిర్వహణలో ఏజన్సీ నిర్వహకులు విఫలం చెందారు. జిల్లా మెడికల్ కాలేజిలో అవుట్ సోర్స్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ప్రయివేటు ఏజన్సీ వారికి అప్పగించింది. ఏజన్సీ వారు నోటిఫికేషన్ జారీ చేశారు. పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మెడికల్ కాలేజీ ఆవరణలో పరీక్ష ఉన్నట్లు అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్ష సమయానికి పరీక్షా కేంద్రానికి హాజరైన అభ్యర్థులకు ఏర్పాట్ల విషయంలో అనుకోని షాక్ ఎదురైంది. ఏజన్సీ వారు రాత పరీక్షకు రూములు కేటాయించలేదు. హాల్ టికెట్స్ నెంబర్ ప్రకారం సీట్లు కేటాయించలేదు. దీంతో అభ్యర్థులో గందర గోళం, ఆందోళన చోటుచేసుకుంది. హైద్రాబాద్, మహబూబ్బాద్, వరంగల్, ఖమ్మం తదితర దూర ప్రాంతాల నుండి నిరుద్యోగ అభ్యర్థులు వేలాదిగా తరలి వచ్చారు. అభ్యర్థుల రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయలేదు. అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు నిర్వహుకులు చేతులెత్తేశారు. ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహకులు కొత్తవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పరీక్ష నిర్వహణలో హాల్ టికెట్లు రాలేదని కొందరు పరీక్షా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తు, ఆందోళన చేశారు.
కలెక్టర్ ఆగ్రహం....
మెడికల్ కాలేజీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం నియామకం కోసం జరగాల్సిన పరీక్ష గందరగోళం కావడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏజెన్సీ నిర్వహణ లోపం వల్ల అభ్యర్థులు ఇబ్బందులకు గురైన విషయంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నుండి సమాచారం సేకరించారు. ఏజన్సీని రద్దు చేయనున్నట్లు సమాచారం.
ఆందోళన....
సమయానికి పరీక్ష నిర్వహించక పోవడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మెడికల్ కాలేజ్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. నిర్వహకులు నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిర్వహకుల నుండి వివరాలు సేకరించారు. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అవుట్సోర్సు ఏజన్సీ నిర్వహకులు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు నిరుత్సాంగా వెనుతిరిగారు.
ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూళ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
తక్షణమే యారో ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ గుర్తింపు రద్దు చేయాలనీ, నూతన ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం కోరారు. సిలబస్ ఇవ్వకుండా ఎలా పరీక్ష నిర్వహిస్తారో తెలపాలన్నారు. తిరిగి నెల వ్యవధిలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జమ్మి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.