Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు అక్షరముక్క రాని వైనం
- కనీసం తెలుగు చూచి చదవలేని దుస్థితి
- కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము బూడిదల పోసిన పన్నీరు
- చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం
నవతెలంగాణ-చెర్ల
నేటి విద్యార్థులే రేపటి భారతావని మేథావులని చెప్పుకోవడానికి మినహా ఆచరణలో పురోగతి లేదని పలువురు విద్యా విశ్లేషకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. చర్ల మండలంలో విద్యావ్యవస్థను పర్యవేక్షించే వాళ్ళు లేక నానాటికి తిరోగమన స్థితిలో చదువులు ఉన్నాయనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.
మండల వ్యాప్తంగా 85 పాఠశాలలకు గాను సుమారు 5000 మంది విద్యార్థులు ఆయా పాఠశాలలో విద్య నేర్చుకుంటున్నారు. అయితే కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం విద్యార్థులపై దృష్టి సారించకపోవడం వలన విద్యార్థులకు అక్షరం ముక్క రావట్లేదని విమర్శలు లేకపోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకత అంటూ ఎన్నో ప్రణాళికలు విద్యావ్యవస్థలో రూపుదిద్దుతూ ఉంటే కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వల్ల సుమారు 60 శాతం విద్యార్థులకు కనీసం అక్షరం ముక్కరాని వైనం మండలంలో ఉందంటే ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందో ఆలోచించాలి. కొంతమంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి రావడం, సమయపాలన పాటించక పోవడం, పాఠశాలలో ఉండి కూడా విద్యార్థులను పట్టించుకోకపోవడం వెలసి విద్యార్థులు అక్షరాలు గుర్తుపట్టలేనంతగా విద్యావ్యవస్థ తిరుగమన స్థితిలో ఉందని చెప్పవచ్చు. సమాజ అభివృద్ధికి విద్య ఆవశ్యకత గణనీయంగా పెరగాల్సి ఉండగా మండలంలో అది రోజు రోజుకు అవరోహణ క్రమంలో పడిపోతుందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వలన విద్యా వ్యవస్థ అభివృద్ధి క్రమంగా దిగజారుతుందని పలువురు అంటున్నారు. విద్య కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ ఉంటే కొంతమంది ఉపాధ్యాయులు సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఏజెన్సీ విద్యను గాలికి వదిలేస్తున్నారని గాఢమైన విమర్శలు లేకపోలేదు.
చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం
ఏజెన్సీలో విద్య నానాటికి గాడి తప్పుతూ ఉంటే సక్రమంగా సమన్వయం చేయాల్సిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారని పలువురు దూయపడుతున్నారు. రోజుకు సుమారు 5000 నుండి 6000 రూపాయలు జీతం తీసుకునే కొంతమంది ఉపాధ్యాయులు కనీసం 500 రూపాయల పని కూడా చేయట్లేదని, పాఠశాలలో పిల్లలకు పాఠాలు నేర్పించకుండా తమ తమ చెరవాణిలో కాలం గడుపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మూడు నెలలకొకసారి మండల ప్రజా పరిషత్తులు జరిగే సర్వసభ్య సమావేశంలో సైతం విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని ఆందోళన జరగడం తుదిమెరుపు. ఇకనైనా కలెక్టర్ స్థాయి అధికారులు ఏజెన్సీ విద్యపై దృష్టి సారించి మండల విద్యాశాఖ అధికారిని స్థానికంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యా వ్యవస్థను మార్చాలి..
ప్రజా పోరాటాలు తప్పవు : కారం నరేష్,సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
ఏజెన్సీలో రోజురోజుకు నీరుగారు తున్న విద్యా వ్యవస్థను వెంటనే మార్చాలి. మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలలో కొంతమంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. సమయపాలన పాటించకుండా సొంత పనులకు సమయం ఎక్కువ కేటాయిస్తున్నారు. విద్యా వ్యవస్థను ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవు.