Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న
- మాజీ ఎంపీ డాక్టర్ మీడియా బాబురావు
నవతెలంగాణ -దుమ్ముగూడెం
పోడు భూములకు హక్కు పత్రాలు అందజేసే విషయంలో కమిటీల పేరుతో ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తావ్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ను మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మండలంలో ములకపాడు సెంటర్ లో గల యలమంచి సీతారామయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సిపిఐ(ఎం) మండల జనరల్ బాడీ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు మాట్లాడుతూ... ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలంటే ముందుగా రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిపి కమిటీలు ఏర్పాటు చేయాలని అనడం కాలయాపన చేయడమేనని ఆయన అన్నారు. కమిటీలను పక్కనపెట్టి పోడు కొట్టి సాగుచేసుకుంటున్న ప్రతి నిరుపేద ఆదివాసీలకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం వెంటనే హక్కు పత్రాలు అందజేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2021వ సంవత్సరం నవంబర్ 6 నుండి మొదలుకొని డిసెంబర్ 18వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కమిటీలు వేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని మళ్లీ ప్రత్యేకించి కమిటీలు అవసరం లేదని వీలైనంత త్వరగా పోడు భూములకు పట్టాలిచ్చి పోడు సాగుదారులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పోడు సాగుదారులందరికీ రైతుబంధు వర్తింపచేయాలన్నారు. గోదావరి ముంపు ప్రజలకు పదిలేవ సాయం అందజేయాలన్నారు. దుమ్మగూడెం మండలంలో పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడుతామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కోర్స చిలకమ్మ, సరియం రాజమ్మ, మర్మం సమ్మక్క, యసా శ్రీనివాస్ రెడ్డి, వాగే ఖాదర్ బాబు, సోయం నాగమణి, కల్లూరు వీరభద్రం, ఎండి మహమ్మద్ బేగ్, సర్పంచ్ తోడం తిరుపతిరావు పాల్గొన్నారు.