Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
తెలంగాణ విలీన దినోత్సవంపై బిజెపి దుష్ప్రచారా లను కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మధిర నియోజకవర్గస్థాయి పూర్తి కాలం కార్యకర్తల, ముఖ్య నాయకుల సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విముక్తి, విమోచన, విలీనం, విద్రోహం అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు వివరించాలనే బాధ్యతతో ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టులు ఏ వర్గం నుంచి వచ్చినా తమ ఆస్తులు దానం చేయడమే కాక తమ తాము ప్రాణాలు చేతులు లెక్కచేయకుండా నాయకత్వం వహించి నైజం దుష్ట పాలనను, జమీందారీ విధానాన్ని రద్దు చేయించడమే కాక భారతదేశంలో విలీనం చేయించారన్నారు. నాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేని వారు నేడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పోరాటానికి మత రంగు పులిమి ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. సెప్టెంబరు 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయటానికి జిల్లా, మండల స్థాయిలో సదస్సులు, సభలు, సమావేశాలు, సెమినార్లు, ర్యాలీలు జరిపి ప్రజలందరికీ చారిత్రక వాస్తవాలను వివరించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి నగ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాల నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, శీలం నరసింహారావు, సిపిఎం బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, దివ్యల వీరయ్య, మడిపల్లి గోపాలరావు, నాయకులు బంధం శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రాములు, మద్దాల ప్రభాకర, తుళ్లూరు రమేష్, మందడపు శ్రీనివాసరావు, పడకంటి మురళి, కూచిపూడి మురళీకృష్ణ, ఏడు నూతల లక్ష్మణరావు, టీఎస్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.