Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఉపాధ్యాయ , విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన నిర్వహించే చలో అసెంబ్లీకి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్ భవన్లో జిల్లా అధ్యక్షులు జీవీ. నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడేళ్ల నుండి పదోన్నతులు, నాలుగేళ్ల నుండి బదిలీలు లేవని, అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థుల విద్యాభ్యాసానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పదోన్నతుల, బదిలీల, నియామకాల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిఓ 317 అమలు వల్ల స్థానికత కోల్పోయి దూర ప్రాంతాలకు వెళ్ళిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, హౌల్డ్లో ఉంచిన 13జిల్లాల స్పౌజ్ బదిలీలను చేపట్టాలని, ఉపాధ్యాయుల అప్పీలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని, శాశ్వత నియామకాలు జరిపే వరకు విద్యా వాలంటీర్లను నియమించి విద్యార్థుల విద్యాభ్యాసానికి నష్టం లేకుండా చూడాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని , అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని ,పాఠశాల గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు మాట్లాడుతూ కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని కేజీబీవీ, సర్వశిక్షలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలుచేసి, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులు పొదుపు చేసుకున్న జిపిఎఫ్, టీఎస్ జియల్ఐ ఖాతాల నుండి ఋణాలు, తుది చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకుంటే, సంవత్సరం గడిచినా ఋణాలు, తుది చెల్లింపులు చేయకపోవడం పట్ల సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి ఎకౌంట్లలో వెంటనే పైకం జమ చేయాలని కోరారు. జిఫియఫ్ స్లిప్పులు విడుదల చేయాలన్నారు. 2020-21, 2021-22 సంవత్సరం జెడ్.పి.జి.పి.ఎఫ్. స్లిప్పులు వెంటనే విడుదల చేయాలని, ఆన్లైన్ పోర్టల్ ఖాతాలు ఉంచాలని, వెబ్సైట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు నాగ మల్లేశ్వరరావు, నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. సమావేశంలో షేక్ మహబూబ్ అలీ, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, షేక్ రంజాన్, సుధాకర్, మంగీలాల్, నరసయ్య, డి.నాగేశ్వరరావు, రమేష్, లక్ష్మణరావు, సురేష్, నిర్మలాకుమారి, వి.వి. రామారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.