Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూస్వాములను గడగడలాడించిన చరిత్ర వారిది..
- వేలాది ఎకరాల భూములు పంచారు..
- బీజేపీకి 'తెలంగాణ' పోరాటంలో చోటే లేదు
- 10 - 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలోని భూస్వాములను గడగడలాడించి వేలాది ఎకరాల భూములను ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. తెలంగాణ పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తమ్మినేని సుబ్బయ్య భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మండల విస్తృతస్థాయి సమావేశంలో పోతినేని మాట్లాడారు. ఖమ్మంరూరల్ మండలానికి చెందిన అమరవీరులు తమ్మినేని సుబ్బయ్య, గంగవరపు శ్రీనివాసరావు, మంచికంటి రాంకిషన్రావు, చిన్న మల్సూర్, పెద్ద మల్సూర్, లింగ వెంకయ్య, గుగ్గిళ్ళ మల్సూర్ తదితరులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. దొరలను గడగడలాడించి భూస్వాముల వద్ద ఉన్న వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంచి పెట్టారని అన్నారు. నైజాం రజాకారులపై, కరుడుగట్టిన భూస్వామ్య దోపిడీపై తిరగబడ్డ వీరులని అన్నారు. నైజాం రాజ్యంలో జమీందారులు, జాగీర్దారులు, దేశముఖ్ లు, భూస్వాముల దోపిడీ సాగిందన్నారు. రైతాంగం, చేతివృత్తుల వారిని కట్టు బానిసలుగా చేశారన్నారు. వారితో వెట్టి చాకిరి చేయించడానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందని అన్నారు. రైతులు పండించిన పంటలను దౌర్జన్యంగా దేశముఖ్ గూండాలు ఆక్రమించినప్పుడు కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాడి పంటలను రక్షించారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎటువంటి సంబంధం లేని బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ మాట్లాడుతూ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10- 17 వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి తప్పుడు విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్ 4, 5, 6 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య, తోట పెద్ద వెంకటరెడ్డి, పెండ్యాల సుమతి, నందిగామ కృష్ణ, యామిని ఉపేందర్, పెరుమాళ్లపల్లి మోహన్రావు, పార్టీ మండల కమిటీ సభ్యులు ధనియాకుల రామయ్య, ధనియాకుల గాయత్రి, మేడికొండ నాగేశ్వరరావు, ఏటుకూరి ప్రసాద్, వడ్లమూడి నాగేశ్వరరావు, భూక్యా నాగేశ్వరరావు, ఏటుకూరి పద్మ, నంబూరి మంగ, నంబూరి వెంకటనారాయణ, దగ్గుపాటి వైకుంఠం, బుర్ర వెంకటేశ్వర్లు, కొర్నే వెంకయ్య, పల్లి శ్రీనివాసరావు, అర్వపల్లి శ్రీనివాస్, దుండిగాల వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కారుమంచి గురవయ్య, పొన్నం వెంకటరమణ, తమ్మనబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.