Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచాలని, లాభాల వాటా చెల్లించాలని, జీ.ఓ.నెం.60, కోలిండియా ఒప్పందాలను, కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని, అన్ని విభాగాల కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 9 నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మీకు తెలిసినదే. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఇప్పటికే అనేకసార్లు తమ దృష్టికి తీసుకొచ్చామన్నారు. 2017లో సింగరేణి ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో ఆనాటి ఎంపి కల్వకుంట్ల కవిత 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండంలో రాష్ట్ర మంత్రి కెటిఆర్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని స్వయంగా హామీ ఇచ్చిన విషయాన్ని మీకు గుర్తుచేశారు. కానీ నేటికి ఈ హామీలు అమలు కాలేదు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై మాట్లాడాలని, ముఖ్య మంత్రితో చర్చించి జిఓఎంఎస్.నెం.60ని అమలు చేయించి, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచి సమ్మెను విరమింపచేసేందుకు కృషి చేయాలని మధు కోరారు. లేని ఎడల సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల మీ చిత్తశుద్ధిని శంకించవలసి వుంటుందని, కింది స్థాయిలో కాంట్రాక్టు కార్మికుల నుండి నిరసనను ఎదుర్కోవలసి వస్తుందని తెలియజేశారు.