Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వ రోజు సమ్మె విజయవంతం
- గ్రీవెన్స్‌లో కలెక్టర్ అనుదీప్‌కి వినతి
- ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి
- జేఏసీ నాయకులు డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా జరుగుతున్న కాంట్రాక్టు కార్మికుల సమ్మె సోమవారం కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ మీదుగా బస్టాండ్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అత్యంత విజయవంతంగా వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులతో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు భైఠాయించి కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించారు. కోల్ ఇండియాలో అమలుచేస్తున్న విధంగా హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు. సింగరేణి వైద్యశాలలో కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సమ్మె ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, సంస్థలో బొగ్గు ఉత్పత్తి నిలిచేల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, పి.సతీష్, ఎల్.విశ్వనాథం, సత్యం, డి.వీరన్న, పిట్టల రవిందర్, వై.ఆంజనేయులు, ఎం.మల్లిఖార్జున్, డి.నిర్మల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు, సంఘీభావం తెలిసిన రాజకీయ పార్టీల నాయకులకు, కార్మిక సంఘాల నేతలకు, జేఏసీ నాయకులు అభినందనలు తెలిపారు.
కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ సంఘీభావం : బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్
సింగరేణిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసిన హైపవర్ వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నాలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 30 శాతం పిఆర్సీని కానీ, జీవో నెంబర్ 22ను కానీ అమలు చేయాలని, లేబర్ డిపార్ట్మెంట్ సమక్షంలో సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే వీరి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, కె.రమేష్ బాబు, కూరపాటి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు కాంట్రాక్ట్ కార్మికుల పని ఆధారంగా జీతాలు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని 18 డిమాండ్లతో సింగరేణి చేస్తున్న సమ్మె సోమవారానికి నాలుగవ రోజుకు చేరింది. కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి జగదాంబ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు తాళ్లూరి కృష్ణ, షేక్ యాకూబ్ షావలి, బంధంనాగయ్య, ఎండి రాసుద్దిన్, నాగేశ్వరరావు జెకె సాంబు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జీతాలు పెంచకుండా ఎట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు. పెర్మనెంట్ కార్మికులు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్‌తో పాటు అన్నియూనియన్ల బ్రాంచ్ కార్యదర్శులకు జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇచ్చామని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె పోరాటానికి మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బిఎంఎస్ హెచ్ ఎంఎస్ నాయకులు ఆరుట్ల మాధవరెడ్డి సూర్యవంశీ శుక్లాల్ సంఘీభావం తెలిపి ప్రసంగించారు.
మణుగూరు సింగరేణి యాజమాన్యం దిగిరావాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాల పెంపు కోరుతూ గత మూడు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నందున సింగరేణి యాజమాన్యం ఇకనైనా దిగివచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలనాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపులో వీరి సమ్మెకు సీపీఐ(ఎం), కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, బూర్గుల నర్సయ్య, కంపా రవి, సొందే కుటుంబరావు, మున్నా లక్ష్మి కుమారి, దుర్గ్యాల సుధాకర్‌లు మద్దతు పలికి తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జేఏసీ నాయకులు ఎం.నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా జేఏసీ నాయకులు వెలగపల్లి జాన్, అక్కి నరసింహారావు, ఆర్.మధుసూదన్ రెడ్డి, ఎండీ గౌస్, గౌని నాగేశ్వరరావు, నరసింహారావు, ఎం.మంగీలాల్, వి.జానయ్య, కృష్ణయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.