Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, పండగ సెలవులు, ఆదివారం సెలవును అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి గ్రామ పంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడుగునా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీఐటీయూ కార్యాలయం బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా జరిగిన ధర్నా నుద్దేశించి ఏజే.రమేష్ మాట్లాడారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానం వల్ల కార్మికులను ప్రభుత్వం బానిసలుగా పరిగణిస్తుందని విమర్శించారు. కారో బార్లు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. 2022 జనాభా లెక్కల ప్రకారం కార్మికులను నియమించాలని, ప్రస్తుతం ఉన్న కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని, సిఐటియు డిమాండ్ చేసింది. రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఏజే రమేష్ డిమాండ్ చేశారు. ఆదాయం ఉన్న మేజర్ పంచాయతీల్లో వేతనాలు పెంచుకునే వెసులుబాటు పాలకవర్గాలకు కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులకు కూడా మున్సిపల్ కార్మికులకు ప్రకటించిన విధంగా కేటగిరీల వారీగా రూ.15,600లు, రూ.19,500లు, రూ.22,600లుగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతీ పత్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్‌కి అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.బ్రహ్మచారి, జిల్లా అధ్యక్షులు శివకృష్ణ, సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కన్వీనర్ డి.వీరన్న, యూనియన్ నాయకులు సతీష్, తోకల నరేష్, కల్లూరి నరసింహారావు, సాయి, రత్నం, లింబ నాయక్, వెంకటేశ్వర్లు, బిచ్చా నాయక్, బిక్షం, నిమ్మల మధు తదితరులు పాల్గొన్నారు.