Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రేజింగ్ కాంట్రాక్టర్
- ఇసుక రవాణాను అడ్డుకున్న నర్సాపురం సర్పంచ్, గ్రామస్తులు
- సర్పంచ్‌పై దాడికి యత్నించిన గుత్తేదారు అనుచరులు
- లైసెన్స్ రద్దు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని నర్సాపురం గోదావరి ఇసుక ర్యాంపు కేంద్రంగా అర్ధరాత్రి పూట ఇసుక రవాణా సాగుతోందని రేజింగ్ కాంట్రాక్టర్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నాడని, వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం సర్పంచ్ శివరామకృష్ణ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని నర్సాపురం గోదావరి ఇసుక ర్యాంప్ నుండి అర్ధరాత్రి పూట అక్రమ ఇసుక రవాణా సాగుతుందనే సమాచారం మేరకు నర్సాపురం సర్పంచ్ వర్షా శివరామకృష్ణ ఆదివారం రాత్రి గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో టీఎస్ 30 టీఏ 2949 అనే నెంబర్ గల లారీలో పొక్లెయిన్‌తో ఇసుక లోడు చేస్తున్నారు. ఎవరి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని లారీ డ్రైవర్‌ను, అక్కడ ఉన్న రేజింగ్ కాంట్రాక్టర్ అనుచరులను సర్పంచ్ శివరామకృష్ణ ప్రశ్నించగా చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్‌లు చెప్పినట్లు వారు తెలిపారు. ఆ సమయంలో తనపై గుత్తేదారు మనుషులు దాడికి యత్నించారు అని సర్పంచ్ నవతెలంగాణకు తెలిపారు.
నర్సాపురం గోదావరి ఇసుక ర్యాంప్ సొసైటీ అనుమతులు లేనప్పటికీ గతంలో రేజింగ్ కాంట్రాక్టర్, నర్సాపురం ఉప సర్పంచ్, రావులపల్లి రవికుమార్‌లు అర్ధరాత్రి పూట అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక సొసైటీని రద్దు చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు తనపై దాడికి యత్నించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కోరుతూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ శివరామకృష్ణ తెలిపారు.