Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు
- జడ్పీటీసీ రూ.5 వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల కేంద్రమైన బూర్గంపాడులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కంటిలో పెన్సిల్ గుచ్చుకున్న సంఘటన సోమవారం జరిగింది. తరగతి గదిలో ఇరువురు విద్యార్థులు పుస్తకం విషయంలో తోపులాట చేసుకుంటున్న క్రమంలో పక్కనే ఉన్న మరో విద్యార్థి కంటికి 'పెన్సిల్ గుచ్చుకుని గాయమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువున్న ఇరువురు విద్యార్థులు తరగతి గదిలో పుస్తకాలు గుంజుకుంటున్నారు. ఈ క్రమంలో మరో విద్యార్థి రాకేష్ కంటికి ప్రమాదవశాత్తు పెన్సిల్ గుచ్చుకుంది. దీంతో తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు దేవ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థితో గాయమైన విద్యార్ధిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పరిశీలించిన వైద్యులు భద్రాచలం తీసుకవెళ్లాలని పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన విద్యార్థులు వెనుదిరిగి పాఠశాలకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్ప, పలువురు యువకులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడుతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఈ క్రమంలో గాయమైన విద్యార్థి రాకేష్ పాఠశాలకు చేరుకున్న అనంతరం సమాచారం తెలుసుకున్న వార్డెన్ పాఠశాలకు చేరుకు న్నాడు. కుటుంబసభ్యులను సమాచారం అందించి భద్రాచలం అక్కడ నుంచి పాల్వంచలోని ఎల్.వి.ప్రసాద్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు తక్షణమే హైదరాబాద్ తరలించాలని సూచించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో కలిసి హైదారాబాద్ తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ పై విమర్శలు వెలువడుతున్నాయి.
ఆర్థికసాయం అందజేసిన జెడ్పీటీసీ : గాయమైన విద్యార్ధి రాకేష్‌ను హైదరాబాద్ తరలించాలని సూచించడంతో విద్యార్థి తల్లితండ్రులకు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత రూ.5 వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు దృష్టికి ఆమె తీసుకెళ్లారు. హైదారాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు.