Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ- నేలకొండపల్లి
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన బందగి చరిత్ర బిజెపి నేత బండి సంజయ్కు తెలుసా అని చరిత్రను వక్రీకరించి చెప్పే సూత్రం ఒక్క బీజేపీకి మాత్రమే ఎరుకని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రావెళ్ల భవనంలో సిపిఐ(ఎం) మండల జనరల్ బాడీ సమావేశం మండల నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై బిజెపి నేతలు తప్పుడు ప్రచారానికి పూనుకోవడం వారి అసమర్ధ విధానాలకు, చేతగానితనానికి అర్థం పడుతుందన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిజాం- హిందువుల పోరాటంగా బిజెపి చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసి సాయుధ ఉద్యమాన్ని నడిపించిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మండలంలోని బోదులబండ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా డాక్టర్లు, సిబ్బంది, సంబంధిత పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆయా ఆసుపత్రులలో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు ఏటుకూరి రామారావు, కట్టెకోల వెంకన్న, ఉమామహేశ్వరి, బండి రామమూర్తి, ఏలూరి రంగారావు, ఏరదేశీ నరసింహారావు, డేగల వెంకటేశ్వరరావు, శీలం అప్పారావు, పెద్దిరాజు నరసయ్య, రాసాల కనకయ్య, శివరాజు, గుగులోతు వీరు నాయక్, షేక్ మస్తాన్, మందడి కోదండ రామారావు, లింగరాజు, గాదే వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, మధు పెరుమాళ్ళు, కె.వి చారి, ఇంటూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.