Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డువస్తే జెసిబితో తొక్కిస్తా అంటూ హెచ్చరికలు
- తాము అనుమతులు ఇవ్వలేదు: మైనింగ్ ఏడి
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ మండలంలో మట్టి మాఫియా డాన్లు రెచ్చిపోతున్నారు. మట్టి తోలకాలకు అడ్డువస్తే జెసిబితో తొక్కిస్తానని వీఆర్ఏకు హెచ్చరికలు జారీ చేశాడు. మండలంలో ఏ గ్రామంలోనూ తాము మట్టి తోలకాలకు అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ ఏడి సంజరు కుమార్ స్పష్టం చేశారు. అయినా మట్టి మాఫియా డాన్లు మట్టి విక్రయాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు.
మండల పరిధిలోనే లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి యథేచ్చగా అక్రమంగా మట్టి విక్రయాలు నిర్వహిస్తున్నాడు. తనకు గల రెండు ఎకరాల పొలంలో ఈ మట్టి తోలకాలను రెండు మూడు సంవత్సరాల నుంచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. తన సొంత రెండు ఎకరాలలో మట్టి తగ్గుముఖం పట్టడంతో తన పక్కనే గల మరో రెండు ఎకరాలను కూడా ఇటీవల కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ పొలం నుంచి ప్రతిరోజు 100 నుంచే 150 ట్రక్కుల వరకు ఎర్రమట్టి అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టి రూ. 1500 నుంచి రూ. 2000 వరకు విక్రయిస్తున్నట్లు వివిధ గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ విధంగా ఒక్కో రోజు సుమారు రూ1.5 లక్షల నుంచి రూ 2.25 లక్షల ఆదాయం వస్తున్నట్లు స్థానికులు అంటు న్నారు. సొంత పొలంలో పొలం సదున పేరుతో యథేచ్చగా మట్టి విక్రయాలు నిర్వహిస్తున్నాడు. అయినా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అనేకమంది రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సమయంలో ఓ విఆర్ఎ అనుమతులు లేకుండా మట్టి అక్రమ విక్రయాలు చేయవద్దంటూ తనను అధికారులు పంపించారని చెప్పగా తన మట్టి అక్రమాల విక్రయాలకు అడ్డువస్తే జెసిబి తో తొక్కి చంపేస్తానని మట్టి డాన్ బెదిరించినట్టు కూడా వీఆర్ఏ విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజు నుంచి ఆ వైపు వెళ్లడానికి తనకు భయం వేస్తుందని సదరు వీఆర్ఏ వణుకుతూ మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ విక్రయాలను అరికట్టాలని ప్రజా ప్రతినిధులు ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
మట్టి తోలకాలకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు
మైనింగ్ ఏడి సంజరు కుమార్
మండలంలో ఏ గ్రామంలోనూ తాము మట్టి తోలకాలకు అనుమతి ఇవ్వలేదు.కానీ కొంతమంది యదేచ్చగా అక్రమ మట్టి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం తాము లక్ష్మీపురంలో దాడులు నిర్వహించ డానికి వెళ్లగా తాము వస్తున్న విషయాన్ని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల పూర్తిస్థాయిలో నిఘా ఉంచలేకపోతున్నాం. అక్రమ మట్టి విక్రయాలపై బోనకల్ రెవిన్యూ కార్యాలయంతో కలిసి నిఘా పెట్టి అక్రమ మట్టి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తాం.