Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కొత్తపల్లి కృష్ణమూర్తి పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోనే గోవిందాపురం(ఎల్) గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కొత్తపల్లి కృష్ణమూర్తి 5వ వర్ధంతి మంగళవారం గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కృష్ణమూర్తి విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, సీనియర్ మాదినేని నారాయణ, మండల కమిటీ సభ్యులు ఉమ్మనేని రవి, ఏడు నూతల లక్ష్మణరావు, కోట కాటయ్య, కొత్తపల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి కృష్ణమూర్తి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళాలకు కొరియర్ గా పనిచేసి కీలక పాత్ర నిర్వహించారన్నారు. కష్ణమూర్తి వివిధ గ్రామాలలో నైజం నవాబు రజాకారుల ఆగడాలను దళాలకు చేరవేస్తూ కీలకపాత్ర నిర్వహించడంతోపాటు దళాలకు క్రమశిక్షణ కలిగిన కొరియర్ గా తన విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆనాడు నైజాం నవాబు రజాకారులు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 9 మందిని బంధించి దళాల సమాచారం చెప్పాలని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఆ 9 మందిలో కృష్ణమూర్తి కూడా ఉన్నారన్నారు. అయితే 9 మందిలో ఏడుగురిని కాల్చి చంపి గోవిందాపురం ఎల్ గ్రామం తీసుకువచ్చి గ్రామంలో గుర్రాలతో మృతదేహాలను ఊరేగిస్తూ ఒకే చితిపై ఏడుగురిని ఖననం చేశారన్నారు. అయితే కొత్తపల్లి కృష్ణమూర్తి ఎర్రగా అందంగా ఉండటంతో పాటు చిన్న వయసు కావటంతో వెళ్లిపో అంటూ విడిచి పెట్టారని ఆ విధంగా కృష్ణమూర్తి ప్రాణాలతో బయటపడ్డాడు అన్నారు. ఆ తర్వాత కష్ణమూర్తి లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఐదేళ్లపాటు నిజాయితీగా క్రమశిక్షణతో పరిపాలన సాగించాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, సిపిఎం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు, పొన్నం రాంబాబు, నల్లమోతు వాని, కారంగుల చంద్రయ్య, వల్లం కొండ సురేష్, ఏసుపోగు బాబు తదితరులు పాల్గొన్నారు..