Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం సీటు సీపీఐకేనా..!
- అధికార పార్టీకి బంగపాటు తప్పదా..?
- పొత్తు ఖరారుకు గవర్నర్ విధానంపై కూనంనేని ఘాటు విమర్శలు
- కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్న అధికార పార్టీ ముఖ్య నాయకులు
నవతెలంగాణ-పాల్వంచ
సాధారణ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు సిట్టింగ్ స్థానం తమదేనంటూ టీఆర్ఎస్లోని పలువురు నాయకులు ఆశపడుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్తగూడెం నియోజకవర్గం స్థానం సీపీఐకి కేటాయించినట్లు సంకేతాలు వెలువడు తున్నాయి. అందుకు ప్రధాన కారణం మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపొందాలి అంటే వామపక్షాల సహకారం తప్పనిసరి అని భావించిన టీఆర్ఎస్ అధినాయకత్వం సీపీఐ, సీపీఐ(ఎం)లతో పొత్తులు ఖరారు చేసింది. బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ(ఎం) పొత్తు పెట్టుకుంది. అదే అదునుగా భావించిన సీపీఐ రాష్ట్ర నాయకులు ఈ పొత్తు కేవలం మునుగోడుకే సరిపోదని రాబోయే సాధారణ ఎన్నికల్లోను కొనసాగిస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేయడంతో కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు పొత్తును స్వాగతించగా తప్పలేదు. ఈ పరిణామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించేలా అంగీకారం కుదిరినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంపై ఆశావాదులకు భంగపాటు తప్పేలా లేదు. ఇప్పటి వరకు సీటు నాదంటే నాదని ఇటు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వీరితోపాటు టిఆర్ఎస్ అధినాయకత్వం ఆశీస్సులతో ఆరోగ్య శాఖ డైరెక్టర్ పడల శ్రీనివాసరావు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే మునుగోడు బై పోల్ కొత్తగూడెం పైన పిడుగు లాంటి వార్తను పేల్చారు. దీంతో అధికార పార్టీకి భంగపాటు తప్పనిసరి అయింది. పొత్తులు ఖరారు అవుతున్నట్లు ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు టిఆర్ఎస్ అధికార పార్టీకి అనుకూలంగా గవర్నర్ విధానం పై ఘాటుగా వ్యాఖ్యానించడం నిదర్శనం. కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటివరకు టిఆర్ఎస్కే సీటు దక్కుతుందని ఆ పార్టీ నాయకులు గంపెడు ఆశతో ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలను నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. తాజా పరిణామంతో కొత్తగూడెం సీటు టిఆర్ఎస్కు దక్కదని స్పష్టం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు చోటుచేసుకున్నాయి. ఇదే తరుణంగా బీజేపీ ఈ సీటును గెలిచేందుకు పావులు కదుపుతోంది. టీఆర్ఎస్లో అసమ్మతి వాదులుగా ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు అటు కాంగ్రెస్ ఇటు బిజెపి వైపు ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా వారు ఖండవలు మార్చే దిశగా వారి ప్రయాణం సాగునుంది. దీంతో కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయం వేడెక్కుతోంది.