Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం వద్ద భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
నవతెలంగాణ-భద్రాచలం
అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల విరాజిల్లుతోంది. కాసులకు కక్కుర్తి పడిన కొందరు ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. సరిహద్దులు దాటించి సొమ్ములు చేసుకుంటున్నారు. పట్టపగలే ఈ దందా యధేచ్చగా సాగుతోంది. దొరికితే దొంగా లేదంటే దొరే అన్న చందంగా అక్రమార్కుల కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఏజెన్సీలో అక్రమ రేషన్ దందా : కొందరు అక్రమార్కులు ఇదే తమ పనిగా పెట్టుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొన్ని రేషన్ షాపుల నుంచి పీడీఎస్ రైస్ అక్రమార్కుల చెంతకు చేరుతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈమధ్య ఇదో రకమైన దందా విచ్చలవిడిగా సాగుతోంది. భద్రాచలం మీదుగా కాకినాడ, రాజమండ్రి, చత్తీస్‌గఢ్‌లో భారీగా పీడీఎస్ బియ్యం నిలువలు వాహనాల్లో తరలివెలుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పట్టణంలో ఇదే తరహాలో అక్రమ రవాణా అవుతున్న బియ్యం భారీ స్థాయిలో మంగళవారం పట్టుబడింది. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ పట్టుబడటంతో ఈ మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు పీడీఎఫ్ రైసు యధేచ్చగా సాగిపోతుందన్న ఆరోపణలకు పెద్ద ఎత్తున పీడీఎఫ్ రైస్ పట్టుబడటం సజీవ సాక్ష్యంగా నిలిచింది. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి వద్ద పీడీఎస్ రైస్ తరలిస్తున్న మూడు డీసీఎం వ్యాన్లు, ఒక టాటా మ్యాజిక్‌ను సివిల్ సప్లై అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. ఇందులో 514 క్వింటాళ్ల పీడీఎస్ రైసు ఉండటం గమనార్హం.
కొత్తగూడెం, అశ్వాపురం నుంచి వీటిని తరలిస్తునట్లు సివిల్ సప్లై డీటీ కస్థాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇవి కాకినాడ, రాజమండ్రి, చత్తీస్గడ్ వైపు భద్రాచలం మీదుగా తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే ఇవి నిజంగా అటువైపే వెళుతున్నాయా...? లేక ఎక్కడికి అన్నది మిస్టరీగా మారింది. దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉంది. పీడీఎస్ రైసు సరిహద్దులు దాటుతున్న వైనంపై జిల్లా అధికార యంత్రాంగం మరింత నిఘా పెట్టాల్సి ఉంది. ఇందులో కీలక సూత్రధారులు, పాత్రధారులపై ఆరా తీయాల్సి ఉంది.