Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరం ముంపుపై అధ్యయనం జరగాలి
- ఆ ఐదు మండలాలు తెలంగాణకు ఇవ్వాలి
- లేకుంటే రాముడికి ప్రమాదంగా మారనుంది
- అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, ఆంధ్రాలో కలిపిన మన ఐదు గ్రామాలను మనకిస్తే రాముడిని రక్షించుకోవడంతో పాటు గోదావరి ముంపు బాధితులకు పునరావాసం కల్పించడం, కరకట్ట విస్తరించడానికి వీలుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే కేంద్రప్రభుత్వం స్పందించి ఈ అంశంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి భద్రాచలం వచ్చిన సందర్భంగా ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా వాస్తవ పరిస్థిని గమనించడం జరిగిందన్నారు. ఇది చాలా జఠిలమైన సమస్య అయినప్పటికి ఆంధ్రాతో కొట్లాడే అంశం కాదన్నారు. రాముడిని రక్షించాలన్నా, కరకట్ట నిర్మాణం జరగాలన్నా, ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలన్నా ఆంధ్రా ప్రాంతం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి పూర్తిగా సహకారం అందించాలన్నారు. కేంద్రం తన బాధ్యతగా పెద్దన్న పాత్ర పోషించి రాములోరిని కాపాడాలన్నారు. సండ్ర వెలిబుచ్చిన విషయాలపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పోలవరం ఎత్తు విషయంతో పాటు రాములు వారిని కాపాడాలనే విషయంపై అప్పట్లోనే కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడటం, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లాంటివి చేసినా చెవిటి వాని ముందు శంఖమూదిన చందంగా ఉందన్నారు. ఈ విషయంమై సుప్రీంకోర్టులో అనుభవజ్ఞుడైన లాయరును పెట్టి కేసువేయడం కూడా జరిగిందన్నారు. కోర్టు ద్వారానైనా రాముడిని కాపాడుకుందామని హరీశ్‌రావు ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు.