Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వదలని గోదావరి వరద భయం
- బూర్గంపాడు-సారపాక మధ్య రాకపోకలు బంద్
- మూడో ప్రమాద హెచ్చరిక సమీపంలో గోదావరి ప్రవాహం
నవతెలంగాణ-బూర్గంపాడు
మళ్ళీ బూర్గంపాడును మూడు వైపులా గోదావరి వరద చుట్టు ముట్టింది. భద్రాచలం వద్ద గోదావరి వరద 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు సమీపంగా వరద గోదావరి పోటెత్తుతోంది. అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బూర్గంపాడు-రెడ్డి పాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఇదే క్రమంలో రెడ్డిపాలెం-బూర్గంపాడు గ్రామాల మధ్య ఉన్న పులితోరు వాగు రహదారిపైకి వరద గోదావరి చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బూర్గంపాడు-సోంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా మండల కేంద్రమైన బూర్గంపాడుకు చెందిన ప్రజలు భద్రాచలం వెళ్లాలంటే మోరంపల్లి మీదుగా లక్ష్మీపురం, మణుగూరు క్రాస్ రోడ్డు, సారపాక మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా మండల కేంద్రమైన బూర్గంపాడులోని కొల్లు సమీపంలోని స్మశానవాటిక గోదావరి వరద ముంపుకు గురైంది. అదే విధంగా గోదావరి వరద ప్రవాహం మరో మూడు అడుగులకు చేరితే బూర్గంపాడు-కుక్కునూరు గ్రామాల మధ్య ఉన్న రాకపోకలకు కూడా అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. అలాగే బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్, అదనపు ఎస్సై రమణారెడ్డిలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
బూర్గంపాడుకు చుట్టూ గోదావరి :
మళ్లీ గోదావరి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. సోమవారం నుంచి గోదావరి క్రమ క్రమంగా పెరిగి మండల కేంద్రమైన బూర్గంపాడును మూడు వైపులా గోదావరి వరద చుట్టేసింది. ఈక్రమంలో బూర్గంపాడులోని వివిధ కాలనీలకు చెందిన లోతట్టు ప్రాంతవాసులను గోదావరి భయం వదలటం లేదు. గత నెలలో వరద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో సర్వం కోల్పోయిన బూర్గంపాడు మండల కేంద్రం వాసులకు మళ్లీ వరద గోదావరి తన ప్రతాపం చూపుతుండటంతో తల్లడిల్లిపోతున్నారు. కాగా బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీ గృహాలకు సమీపంగా గోదావరి వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం సాయంత్రం 5 గంటలకు 51.4 అడుగులు ప్రవహిస్తోంది. గోదావరి వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జలసంఘం అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గోదావరి వరద పెరిగితే అంబేద్కర్ కాలనీతో పాటు పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం గోదావరి వరద పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.