Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ మండలం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల పురిటి గడ్డ ఈ మండలం నుంచి అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించారు నేటికీ ఆ పోరాట అమరవీరుల త్యాగాలు ప్రజల హృదయాలలో తిరుగుతూనే ఉన్నాయి. భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది తమ ప్రాణాలను తణప్రాయంగా అర్పించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలం పేరు గడిచింది. బోనకల్లు మండలం నుండి ఎంతోమంది వీరా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాట ఘట్టాలను మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మచ్చ వైకుంఠం 'నవ తెలంగాణ'కు వివరించారు. 15 ఆగస్టు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్రం రాలేదని తెలిపారు. నైజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు తమతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అనేకమంది అలుపెరగని పోరుబాట పట్టారని తెలిపారు. భూమికోసం, విముక్తి కోసం సాగిన ఈ ఉద్యమంతో నైజాం నవాబుకు తాము ముచ్చమటలు పట్టించామని తెలిపారు. 'నీ కాళ్లు మొక్కుతా బాంచన్' అన్న ప్రజలే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకులు చేత పట్టారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఆంధ్ర మహాసభ సాక్షిగా ఈ మహౌద్యమం ప్రారంభమైందన్నారు. ఆనాడు వరంగల్ జిల్లాలోని అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన సాయిధ పోరాట యోధుడు రావిళ్ళ జానకిరామయ్య ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షులుగా, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారని తెలిపారు. ఆయన నాయకత్వం లోని గోవిందాపురం ఎల్, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురం, చిరునోముల, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, చొప్పకట్లపాలెం, పెద్దబీరవల్లి తదితర గ్రామాలకు చెందిన అనేకమంది యువకులను గెరిల్లా సైనికులుగా తీర్చిదిద్దామని తెలిపారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వరరావు గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన చుండూరి నరసింహారావు ప్రజా నాయకులుగా నియమించబడ్డారని తెలిపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆనాటి చింతకాని పోలీస్ స్టేషన్ పై దాడి చేశామని తెలిపారు. బ్రాహ్మణపల్లి, గోవిందాపురం ఎల్, లక్ష్మీపురం గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోసాయన్నారు. ఈ గ్రామానికి చెందిన అనేకమంది సాయుధ పోరాటంలో అసువులు బాషారని తెలిపారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాదే మాధవరెడ్డిని హత్య చేసిన తరువాత ఉద్యమం మరింత ఉధతంగా కొనసాగిందన్నారు. ఆ ఉద్యమంలో పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అనేక మందిని రజాకార్ల మూకలు అత్యంత దారుణంగా తమ సహచరులను చంపారని తెలిపారు. అప్పట్లో బ్రాహ్మణపల్లి గ్రామం ఉద్యమ కేంద్రంగా మారిందన్నారు. ఈ పోరాటంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడిపల్లి జోగయ్య, పారుపల్లి జోగయ్య పోరాటంలో కీలకపాత్ర నిర్వహించారని తెలిపారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంతో వందలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి పెట్టామని తెలిపారు. ఆనాడు గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి కష్ణమూర్తి తమకు కొరియర్గా వ్యవహరించాడని తెలిపారు. కొత్తపల్లి కృష్ణమూర్తిని దళాలకు సమాచారం అంది స్తున్నాడని నెపంతో నైజాం నవాబు సైన్యం పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసిందన్నారు. మల్లెల వెంకటేశ్వరరావు పేరు చెబితే పిట్టల నీళ్లు తాగలేదని నానుడు ఉందన్నారు. ఆ విధంగా మల్లెల వెంకటేశ్వర రావు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర నిర్వహించారన్నారు. లక్ష్మీపురం గోవిందపురం ఎల్ గ్రామాల నుంచి అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ గ్రామాల నుంచి రావూరి వెంకటరామయ్య, మల్లెల విశ్వనాథం, తమ్మారపు భద్రయ్య, చుండూరి కృష్ణమూర్తి, తమ్మారపు భద్రయ్య, కారంగుల సైదులు, తమ్మారపు హుస్సేన్ ముష్టికుంట్ల నుంచి చెల్ది వీరస్వామి చిరునోముల నుంచి బోడెపుడి శేషయ్య, కటారి రామకోటయ్య, నిమ్మ తోట జగ్గయ్య, నిమ్మ తోట సీతయ్య, ప్రొద్దుటూరు నుంచి తాళ్లూరి రాములు, పెద్ద బీరవల్లి నుంచి ఎనమద్ది రామయ్య ఇలా అనేకమంది ఈ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలను అర్పించారన్నారు. చిరునోముల గ్రామానికి చెందిన బోడెపూడి శేషయ్య తన తల సభ్యులతో కాపలా ఉండగా నిజాం సైన్యం చుట్టుముట్టి పెద్ద ఎత్తున కాల్పులు జరిపిందన్నారు ఆ కాల్పులలో బోడపూడి శేషయ్యకు పొట్టలో నుంచి పేగులు బయటికి వచ్చినా లెక్కచేయకుండా ఆపేగులను తన పొట్టలో వేసుకొని గుడ్డ చుట్టుకొని నిజాం రజాకారులపై తన తుపాకీ గుండ్లతో పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించాడన్నారు. వత్సవాయి క్యాంప్ ఆధారంగా రావెళ్ల జానకి రామయ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. చరిత్రలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిలిచిపోయిందన్నారు. ఆ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు పాల్గొన్నామని, ఆ చరిత్ర నేటికీ తమను ఎంతగానో ప్రభావితం చేస్తుందని, ఆ చరిత్ర గురించి ఆలోచిస్తే తమ శరీరం పులకరించి పోతుందని, ఆ పోరాట ఘట్టాలను భవిష్యత్తు తరాలకు అందించా లన్నది తమ ఉద్దేశం అన్నారు. క్రమశిక్షణకు ఆ పోరాటం మారుపేరుగా నిలిచిందన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గంగసాని తిరుమలయ్య పోరాటంలో కీలకపాత్ర నిర్వహిం చారన్నారు. అనంతరం తిరుమలయ్యను తామర పత్రంతో సన్మానించారని తెలిపారు. తిరుమలయ్య మృతి చెందినప్పటికీ తామర పత్రం ఇప్పటికీ ఉందన్నారు. పారుపల్లి రాఘవయ్య, పారుపల్లి పెద్ద కోటయ్య, గాదే శ్రీనివాస్ రెడ్డి, వంగల పెద్ద వెంకటేశ్వర్లు ఈ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. వీరు నేటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అదేవిధంగా జెర్రిపోతుల రాజారత్నం, కొంగర అప్పయ్య, సాదినేని లింగయ్య, మందడపు నారాయణ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. వీరందరూ ఇటీవల కాలంలోనే మతి చెందారు. ఈ పోరాట ఫలితంగా అనేకమంది పేదలకు భూములు పంచామని తెలిపారు. ఈ పోరాటం ఉదృతంగా సాగుతున్న సమయంలో కమ్యూనిస్టు అగ్ర నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, మాకినేని బసవపున్నయ్య, సర్వదేవపట్ల రామనాథం తదితరులు మండలంలో అనేకసార్లు పర్యటించి తమకు మనోధైర్యం నింపారని తెలిపారు. 1953లో కమ్యూనిస్టు అగ్ర నాయకుడు బసవ పున్నయ్య గోవిందపురం ఎల్ గ్రామంలో నిర్మించిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన ఏడుగురిని దహన సంస్కారం చేసిన స్థలంలో నిర్మించిన స్మారక స్థూపాన్ని అశేష జనాల మధ్య ఆవిష్కరించారని తెలిపారు. ఈ స్తూపం ఆవిష్కరణకు బ్రాహ్మణపల్లి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు నైజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన అనేకమంది పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ప్రస్తుతం ఆనాటి పరిస్థితులు నేటి పరిస్థితులు ఉద్యమాలకు దాదాపు ఒకే రకంగా ఉన్నాయన్నారు. ఆనాడు తాము ఏ లక్ష్యంతో తెలంగాణ పోరాటం సాగించామో నేటి తరం కూడా అదే లక్ష్యంతో భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
ఒకే చితిపై ఏడుగురు దహనం
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అంతమొందించాలని నెపంతో నైజం నవాబు, భూస్వాములు, రజాకారులు ఉమ్మడిగా ఉద్యమకారులపై దాడులు చేశారు. ఆళ్లపాడు గ్రామానికి చెందిన యలమదల రామచంద్రయ్య, మంద అచ్చయ్య వల్లాపురం గ్రామానికి చెందిన గొర్రె ముచ్చు అజరయ్య, మద్ది రాములు రేపల్లెవాడకు చెందిన మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, తమ్మినేని బుచ్చయ్య గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి కష్ణమూర్తి గోవిందాపురం ఏ గ్రామానికి చెందిన భాగం శరయ్య తో పాటు మరికొందరని వివిధ ప్రాంతాలలో బంధించి దళం సభ్యుల సమాచారం చెప్పాలంటూ వివిధ ప్రాంతాల్లో పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు. బంధించిన వారిని రేపల్లెవాడ గ్రామం నుంచి ఈడ్చుకుంటూ గోవిందాపురం ఎల్ గ్రామానికి వీరందరినీ తీసుకువచ్చారు. దళానికి ప్రధాన కొరియర్గా వ్యవహరిస్తున్న కొత్తపల్లి కృష్ణమూర్తిని బంధించి సాయుధ పోరాట యోధుల సమాచారం చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. రేపల్లెవాడ నుంచి నిజాం తుపాకులకు బలైన ఏడుగురు మతదేహాలను గోవిందాపురం ఎల్ గ్రామానికి తీసుకువచ్చి ప్రధాన వీధుల గుండా గుర్రాలతో ఈడ్చుకుంటూ తీసుకువచ్చి ఊరు బయట మంగళ గుట్టపై ఒకే చితిపై పేర్చి ప్రజల ఎదుటే దహనం చేశారు. ఈ క్రమంలోనే రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదతం చేశారే తప్ప వెనుకడుగు వేయలేదు. నిజాం సైనికులు పట్టుకున్న వారిలో కొత్తపల్లి కృష్ణమూర్తి, భాగం శరయ్య లను మాత్రం ఆ ఏడుగురితో చంపకుండా వదిలేశారు. కొత్తపల్లి కృష్ణమూర్తి చిన్నవాడు కావడంతోపాటు 'ఎర్రగా అందంగా ఉన్నావురా వెళ్ళిపో' అంటూ విడిచిపెట్టారు. ఆ తర్వాత కృష్ణమూర్తి లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ గా ఐదేళ్లు పనిచేశారు. సిపిఐ ఎం గోవిందాపురం ఎల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన అమరవీరుల సంస్మరణ సభను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు.