Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
- పర్యవేక్షించని మండల విద్యాశాఖధికారి
- చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-చర్ల
''ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉన్న ఏజెన్సీ మండలం...జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతం చర్ల మండలం. పట్టించుకునే వారు లేక సమయపాలన పాటించని ఉపాధ్యాయులు...పేరుకే మండల విద్యాశాఖ అధికారి ఒక్కరోజు ఉద్యోగ ధర్మం పాటించని మండల విద్య బాస్. పైరవీరులతో మండలాన్ని వదిలిపెట్టని విద్యాశాఖ అధికారి. కొంతమంది ఉపాధ్యాయుల ద్వారా నెలనెలా ముడుపులు అందుతున్నాయని విశ్వసనీయ సమాచారం?. చర్ల మండల విద్యావ్యవస్థ పట్టించుకోని ఉన్నతాధికారులు. నానాటికి కుంటుపడుతున్న ఏజెన్సీ విద్యా వ్యవస్థపై నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.''
సమాజాభివృద్ధి కోసం అత్యంత అవసరమైన విద్యా వ్యవస్థ రోజు రోజుకు కుంటుపడుతూ ఉంటే ఏ ఒక్క అధికారికి కానీ, ప్రజా ప్రతినిధులకు కానీ చిత్తశుద్ధి లేదని విద్యా విశ్లేషకులు చీదరించుకుంటున్నారు. రహదారులు సక్రమంగా లేకున్నప్పుడు ఉపాధ్యాయులు నిత్యం పాఠశాలలకు వెళుతూ విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ తమ తమ ఉద్యోగ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించేవారు. అయితే రహదారులు ఏర్పడి అన్ని వసతులు ఉన్న ఈ రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా రోజువిడిసి రోజు పాఠశాలకు వెళ్తూ ఇష్టానుసారంగా డుమ్మా కొడుతుంటే ఏ ఒక్క అధికారి గాని, ప్రజా ప్రతినిధులు గాని, ప్రజా సంఘాలు కానీ ఏజెన్సీలో నానాటికి నీరు కారుతున్న విద్యావ్యవస్థపై దృష్టి సారించట్లేదని నేటి జనులు వాపోతున్నారు. చక్కటి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు తాము చేసే వృత్తిపై చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి.
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు.. అటకెక్కుతున్న
ఏజెన్సీ విద్య
ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లవలసిన ఉపాధ్యాయులలో కొంతమంది పదిన్నర గంటల వరకు కూడా పాఠశాలకు వెళ్లకుండా మండల కేంద్రంలోని తిరుగుతూ తమ తమ సొంత పనులు చూసుకోవడం వలన ఏజెన్సీలో విద్యార్థులకు క్రమశిక్షణ రోజు రోజుకు తగ్గుతుందని ఏజెన్సీ గ్రామాల ఆదివాసీలు మండిపడుతున్నారు. సాయంత్రం మూడు గంటలకు వరకు చర్ల చేరుకొని తమ తమ సొంత పనులు చేసుకోవడం వలన ఆదివాసి గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులు చెట్లకు, పుట్లకు అంకితం అవుతున్నారు. విద్యార్థులకు పొట్ట కోసిన అక్షరం ముక్క రాకుండా పోవడానికి ప్రధాన కారణం కొంతమంది ఉపాధ్యాయుల్లో పాఠశాలకు సమయానికి వెళ్లాలని జిజ్ఞాస కాని, వెళ్లిన తర్వాత విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని కుతూహలం కానీ లేకపోవడమేనని విశ్రాంత ఉపాధ్యాయులు సైతం పెదవి విరుస్తు న్నారు. సమయానుసారంగా పాఠశాలకు వెళ్లవలసిన ఉపాధ్యాయులను, పాఠశాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారి నిద్ర అవస్థలో ఉండటమే ఏజెన్సీ విద్యకు తూట్లు పడుతున్నాయని విమర్శలు లేకపోలేదు.
పర్యవేక్షించని మండల విద్యాశాఖ అధికారి
విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి సమాజాభివృద్ధికి పాటుపడాల్సిన మండల విద్యాశాఖ అధికారి మండలానికి రాకుండా మొఖం చాటైడం వలన ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తదా అనే చందంగా చర్ల మండలంలో విద్యా వ్యవస్థ తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు చేపట్టకపోవడంతోనే వారి ప్రవర్తనలో మార్పు లేదని ప్రజల ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారి ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఉండకుండా ఉద్యోగం ఇక్కడే ఎలగబెడుతూ పైరవీలు చేయించుకుంటూ నిత్యం ఉపాధ్యాయుల దగ్గర నుండి ముడుపులు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు : సమయపాలన పాటించకుండా, పిల్లలకు అక్షరం ముక్క నేర్పకుండా, కనీసం హాజరు పట్టికలో హాజరు వేసే స్థితిలో కూడా లేని కొంతమంది ఉపాధ్యాయులు లేకపోయిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టక పోవడానికి కారణం ఏంటని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల అలసత్వం ఏజెన్సీ విద్య అందరిని ద్రాక్షగా మారిందని పలువురు ఆందోళన చెందుతు న్నారు. మండల విద్యాశాఖ అధికారి, ఉన్నతాధి కారులు విద్యా వ్యవస్థపై సీత కన్ను వేయడం వలన ఏజెన్సీలో విద్య నానాటికీ నీరు గారుతోందని పలువురు వాపోతున్నారు.
నానాటికి కుంటుపడుతున్న ఏజెన్సీ విద్య
కనీసం అక్షరాలు గుర్తించలేనంతగా ఏజెన్సీ విద్య వ్యవస్థను కొంతమంది ఉపాధ్యాయులు నీరుగారుస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సైతం కూడికలు, తీసివేతలు, భాగాహారాలు రాకపోగా సక్రమమైన క్రమశిక్షణ కూడా లేకపోవడం కొంతమంది ఉపాధ్యాయుల పనితీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదర్శప్రాయులైన ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోవడం వలన విద్యార్థులలో రోజురోజుకు క్రమశిక్షణ లేకపోవడం చదువులపై ధ్యాస తగ్గడం, సెల్ ఫోన్లు, ఇతరేతర అసాంఘిక కార్యకలాపాల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇకనైనా జిల్లా విద్యాధికారి ఏజెన్సీ విద్యపై దృష్టి సారించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుకుందాం.
ఏజెన్సీ విద్యపై చవితి తల్లి ప్రేమ ఎందుకు
అస్తవ్యస్తగా ఉన్న ఏజెన్సీ విద్యను సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఉన్నతాధికారులు ఎందుకు మీన మీసాలు లెక్కిస్తున్నారు. ఉద్యోగ ధర్మం పాటించని విద్యాశాఖ అధికారిని ఎందుకు భుజాలపై ఎక్కించుకుంటున్నారు. పర్యవేక్షణ లోపం వలన విద్యా వ్యవస్థలు బ్రష్టు పట్టిపోతూ ఉంటే చర్యలు చేపట్టకుండా జాప్యం చేయడంలో లోగుట్టు ఏమిటి? పైరవీలు అడ్డు వస్తున్నాయా...ఉన్నతాధికారులకు సైతం ముడుపులు అందుతున్నాయా ఏజెన్సీ విద్యను గాడిలో పెట్టి ఉన్నతాధికారుల నిజాయితీని నిరూపించుకోండి.
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్