Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల ఐక్యవేదిక
నవతెలంగాణ-భద్రాచలం
భారత పార్లమెంటు నూతన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మీడియా బాబురావు డిమాండ్ చేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ప్రజాసంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో డాక్టర్ మీడియా బాబురావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విగాథం కలిగిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతించారు. అంబేద్కర్ వంటి మహానీయుడు పేరు పెట్టడంతో పాటు ఆయన ప్రతిపాదించిన సామాజిక న్యాయం సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిద్ధ శుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అందరికీ అమలు చేయాలని, ఆదివాసీల హక్కులపై జరుగుతున్న దాడిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 140 పారదర్శకంగా అమలు చేసి 2021 డిసెంబర్ నెలలో ప్రభుత్వం తీసుకున్న పోడు దరఖాస్తులన్నిటిని గ్రామ సభలు పెట్టి, అటవీ హక్కుల గుర్తింపు కమిటీలను సమావేశపరిచి ఆ దరఖాస్తులను ఆమోదించాలని తద్వారా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు నిర్వహించిన కూలీలకు డబ్బులు బకాయి ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హాస్టల్లో ఆశ్రమం పాఠశాలలో గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. ధర్నాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కారం పుల్లయ్య అధ్యక్షత వహించగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మచారి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ భుక్యా రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సర్యం రాజమ్మ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలమంచి వంశీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుమ్మరి శ్రీను, గడ్డం స్వామి, గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య, సీఐటీయూ నాయకులు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.