Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య
నవతెలంగాణ-పినపాక
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నైజాం నవాబు దొరదోపిడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన వీరోచిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటికీ మరువలేనిదని ఆ పోరాట ఫలితంగానే నైజాం ఎస్టేట్ భారతదేశంలో విలీనం అయిందని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య అన్నారు. శుక్రవారం పినపాక మండలం జివిఆర్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న అధ్యక్షతన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ ఆధ్వర్యంలో ఈ.బయ్యారం క్రాస్ రోడ్ నుండి సుమారు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీవిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ఉద్యమంలో ఏమాత్రం సంబంధం లేని పార్టీలు, నాయకులు, సాయుధ పోరాటం పై అబద్ధపు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. విముక్తి, విమోచన, విలీనం, విద్రోహం అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని వారు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి మతతత్వ పార్టీలు ముస్లింల నుండి విముక్తి కలిగిందని తద్వారా విమోచన లభించినదని ప్రకటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన బాధ్యతతో పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే పినపాక, కరకగూడెం మండల కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయుధ పోరాటంలోని దశల ను, త్యాగాలను వివరించారు. ఈ సమావేశంలో పాండు రంగాపురం సర్పంచ్ ఈసం భవతి, కరకగూడెం మండల కార్యదర్శి కాంతారావు, పినపాక మండల కమిటీ సభ్యులు కల్తి వెంకటేశ్వర్లు, మడివి రమేష్, దుబ్బా గోవర్ధన్, దడిగల వెంకన్న, నట్టి శంకరయ్య, కర్క గూడెం మండల కమిటీ సభ్యులు చెర్పసత్యం, సత్ర పల్లి సాంబశివరావు, జోగయ్య రమేష్ ,వెంకట్, కనితి రాము, లక్ష్మయ్య, పూస పెద్ద నరసింహారావు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టులు లేకపోతే రాచరిక పాలన
మణుగూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వర్గ పోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులేనని, కమ్యూనిస్టులు లేకపోతే రాచరిక పాలన కొనసాగిదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. శుక్రవారం స్థానిక శ్రామిక భవనంలో తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. 225 సంవత్సరాల నిజాం పాలనకు చరమగీతం పాడింది కమ్యూనిస్టులేనని అన్నారు. దున్నేవాడికి భూమి పదివేల ఎకరాలు పంచిందన్నారు. వెట్టి చాకిరి నిర్మూలనకు ఉద్యమం నిర్వహించిందన్నారు. వీర నారి ఐలమ్మ వీరత్వం దొడ్డి కొమరయ్య బలిదానంతో సాయుధ పోరు మరింత ఉధృతమవడంతో నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది అన్నారు. సాయుధ పోరాటంలో బీజేపీకి సంబంధం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విముక్తి విమోచన అంటూ గావు కేకలు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కొడిశాల రాములు, జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, నాయకులు ఉప్పతల నరసింహారావు, తోట పద్మ, వై.నాగలక్ష్మి, మాచారపు లక్ష్మణరావు, పల్లపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.