Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల మోటార్‌సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారని, బాంచన్ దొర అనే వారితో బందూకులు పట్టించి మూడువేల గ్రామాలను విముక్తి చేయించారని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు స్వాధీనం చేసారని, జాగిర్దారు, జమీందారు, నైజం దుశ్చర్యలను, రజాకార్ దౌర్జన్యాలను ఎదిరించి పోరాడి 4వేల మంది బలిదానాలు అయిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర తెలుసుకోకుండా ఆ పోరాటాన్నే వక్రీకరించి మాట్లాడడం బీజేపీకి సరైందికాదని, ఇలాంటి తప్పుడు ప్రకటనలు, చెత్తవాగుడు మానుకోవాలన్నారు. బిజెపిది దేశ భక్తి కాదని, దేశ ద్రోహ చరిత్ర అని, మతతత్వ బిజెపిని తరిమికొట్టేందుకే టిఆర్ఎస్కు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, బైరాన్‌పల్లి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో మతతత్వ బీజేపీ గెలవకూడదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, మనువాదాన్ని ముందుకు తెస్తూ చరిత్రపై ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్న బీజేపీ చర్యలను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గుర్తించాలని, తీవ్రంగా ఖండించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, వై.విక్రం, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, విష్ణు వర్ధన్, పిన్నింటి రమ్య, కార్పొరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని సిపిఐఎం మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ముఠాపురం, చెన్నారం, సుర్దేపల్లి మండ్రాజుపల్లి తదితర గ్రామాలలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర తెలంగాణ రైతాంగ సాయి పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలను తణప్రాయంగా అర్పించిన అమరవీరులు భాగం వీరయ్య, చావపట్టయ్య, పుసులూరి వెంకటనారాయణ, పుసులూరి విశ్వనాథం, వల్లూరిపల్లి నరసింహారావు, బలుసు సూర్యనారాయణ, బలుసు కష్ణయ్య, నెల్లూరి కూశయ్య, వజ్జా వెంకయ్య, రాపల్లి నాగయ్య చిత్రపటాలకు, స్థూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాడు నేలకొండపల్లి మండలాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని రావెళ్ల సత్యనారాయణ, మచ్చ వీరయ్య, వెలగపూడి విష్ణుమూర్తి వంటి వీర యోధుల నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక దళాలు నాటి నిజాం నిరంకుశత్వానికి, భూస్వాములు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, రచ్చ నరసింహారావు, పెద్దిరాజు నరసయ్య, బలుసు హనుమంతరావు, ఆలగడప అంజయ్య, ఏలూరి రంగారావు, బెల్లం లక్ష్మి, ఇంటూరి అశోక్, గుగులోతు వీరు, బలుసు ప్రమీల, రామచంద్రరావు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల: మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో సీపీఎం గ్రామశాఖ ఆద్వర్యంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సీనియర్ నాయకుడు గడల సీతారామయ్య స్థూపానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూటిఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, గ్రామశాఖ కార్యదర్శి అన్నరాపు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు మోత్కూరి వెంకయ్య, చల్లా నారాయణ, యాసా తిలక్, జగ్గారావు, సీపీఐ నాయకులు పివిరావు యసా వెంకటేశ్వర్లు ఏసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : వీర తెలంగాణ రైతాంగం సాయిద పోరాట చరిత్ర కమ్యూనిస్టులు చేయనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామంలో తెలంగాణ వారోత్సవాల సభను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధుడు ఎనమద్ది రామయ్య స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సిపిఎం దిమ్మలపై సుదర్శన్ రావు సిపిఎం జండాలను ఆవిష్కరించారు. అనంతరం పెద్దపోలు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడారు. పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఎనమద్ది రామయ్య ను ఆనాడు పోరాటంలో నెహ్రూ సైన్యం కాల్చి చంపిందన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ప్రజా ఉద్యమాలలో రావాలని కోరారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిఎం సీనియర్ నాయకులు ఎనమద్ది సత్యనారాయణ సిపిఎం నాయకులు గూగులోతు పంతు, కూచిపూడి మురళీకృష్ణ, చల్లగుండ రామనరసయ్య, కుక్కల కోటేశ్వరరావు, గుగులోతు నరేష్, మిరియాల వెంకటకష్ణ, పేరభత్తని నాగేశ్వరరావు, గంగదేవుల నరసింహారావు, సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ ,ఎంపీటీసీ కర్లకుంట దేవమని, పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని : చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్టులేనని సిపిఎం చింతకాని మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు జిల్లా నాయకులు సామినేని రామారావు పేర్కొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కాటాబత్తిని వీరబాబు, పంగా గోపయ్య, రవి, సతీష్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు
వైరాటౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్దికోసం బిజెపి ప్రయత్నం చేస్తుందని, కమ్యూనిస్టులు త్యాగం వలనే భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిందని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం వైరా మండలం గొల్లెనపాడు గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల వారోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్దా సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి అమరనేని వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఎగురవేసి నివాళులు అర్పించారు. గొల్లెనపాడులో ఆనాడు జరిగిన పోరాటంలో అమరజీవి కొణిదన సీతారామయ్య, కొణిదన సత్యనారాయణ, వెంపటి రఘునాథం నల్లభూతం అప్పయ్య, కందుల వెంకటేశ్వర్లు, కంచర్ల భూమయ్య, రావిళ్ళ సత్యనారాయణ, అమరనేని వెంకటనారాయణ, అమరనేని సూర్యనారాయణ, కంచర్ల మంగయ్య, కంచర్ల పెంటయ్య, చేకూరి మల్లయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. వారి ఆశయాల సాధనకు ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యుల కిలారి శ్రీనివాసరావు, బాజోజు రమణ, గ్రామ కార్యదర్శి అమరనేని వెంకటేశ్వరావు, నాయకులు ధర్మారావు, వెంపటి రాజా, అమరనేని అప్పారావు, నల్లమోతు రాజబాబు, రాజేంద్రప్రసాద్, కంచర్ల శీను, కంచర్ల వెంకటేశులు, కంచర్ల నరేష్, గాజవరపు వెంకటేశ్వర్లు, అమరనేని చైతన్య పాల్గొన్నారు.