Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన నీటి సరఫరా ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ- కల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తామంటూ మిషన్ భగీరథ తరహా పథకాన్ని ప్రవేశపెట్టింది. తరచూ పైపులు పగులుతూ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు రోజుల క్రితం కల్లూరు సమీపంలోని పుల్లయ్య బంజరు రోడ్డులో ప్రధాన పైపులైన్ పగిలిపోయింది. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి తదితర మండలాలలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీటికి గత ఐదు రోజులుగా ప్రజలు అన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడుతు న్నారు. కల్లూరు మండలాల్లో 31 గ్రామ పంచాయతీలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తరచూ పైపులు పగిలి తాగునీటి సరఫరా ఆగిపోవటం మండలంలో తరుచు జరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు వస్తాయను కుంటూ ఎదురుచూస్తూ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కల్లూరు, పోచవరం ఫ్లోరైడ్ రహిత ప్రాజెక్టులు నుండి అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగేది. మిషన్ భగీరథ పథకం ప్రారంభమైన దగ్గర నుండి ఆ ప్రాజెక్టులు మూలనపడ్డాయి. దీంతో ట్యాంకర్లతో గ్రామ పంచాయతీ సర్పంచులు తాగునీటిని ఆయా గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. ఇది ఖర్చుతో కూడినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు అంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తాగు నీరు, పారిశుద్ధ్యం, గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలకు నిధులు మంజూరు చేసేదని, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలతో నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఆ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పటంతో గత జూలై నెల నుండి మూడు నెలల వరకు రావాల్సిన డబ్బులు ఖాతాల్లో పడకపోవటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు వాపోతున్నారు. స్థానిక నీటి వనరులు పని చేస్తే మాకు ఈ కష్టాలుండవని చెబుతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ వెంటనే మరమ్మత్తులు చేసి తాగునీరు సరఫరా చేయాలని తాగునీటి పారిశుద్ధ్య పనులకు మంజూరు చేసిన నిధులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ఆయా గ్రామాల్లోని సర్పంచులు కోరుతున్నారు.