Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరుకో త్యాగ చరిత
- నేలకొరిగిన ఉమ్మడి జిల్లా యోధులెందరో..!
- 'సాయుధ' వార్షికోత్సవం'పై సీపీఐ(ఎం) వందకు పైగా సభలు
- నేడు తెలంగాణ విలీన దినోత్సవం
''ఉద్యమాల ఊయలగా ఊరు...నిజాం రాజులను తరిమిన పోరు...బాంచన్ దొర నీకాల్మక్కుతని బానిసత్వముకు చరమగీతమై వెట్టిచాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం...వీరుల గన్నమ్మా ఇది ఖమ్మం జిల్లమ్మా...సాయుధ పోరుకు చిరునామా సమరాల ఖిల్లమ్మా'' తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి స్థితిగతులకు నిదర్శనం ఈ గీతం. ''బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతవు కొడకో.. నైజాం సర్కరోడా..!'' అంటూ భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇదో మహత్తర ఘట్టం. భారత విప్లవానికి పెద్ద పాఠం. ఐదేళ్ల పాటు సాగిన సమరంలో ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది వీరులు ప్రాణాలర్పించారు. నేడు తెలంగాణ విలీన దినోత్సవం నేపథ్యంలో ఆ త్యాగాలను స్మరించుకుందాం...
నవ తెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''దున్నేవానికి భూమి.. వెట్టి చాకిరీ రద్దు..నిజాం గద్దె దిగాలంటూ'' కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ పల్లెలు మార్మోగాయి. జాగీర్దార్లు, జమీన్దార్లు భూమిపై హక్కుదారులుగా.. పటేల్, పట్వారీలు నిరంకుశ గ్రామ పాలకులుగా..నిజాం రజాకార్లు సాగించిన హత్యాకాండకు నిరసనగా బడుగుజీవి బందూకు చేబూని సాగించిన ''రైతాంగ సాయుధ పోరాటం''లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వేలాది మంది అశువులు బాశారు. 1946-51 సంవత్సరాల మధ్య ఐదేళ్ల పాటు సాగిన ఈ పోరాటానికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నాయత్వం వహించాయి. బడుగు జీవులకు బందూకునిచ్చి సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లాకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. మంచికంటి రాంకిషన్‌రావు, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, పర్సా సత్యనారాయణ, కేఎల్ నర్సింహారావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాథం, తమ్మినేని సుబ్బయ్యతో పాటు పలువురు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కుటుంబాలను వదిలి ఏళ్లకు ఏళ్లు జైలు జీవితాన్ని గడిపారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేశారు.
పోరుగడ్డ బోనకల్
తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా బోనకల్‌కు ప్రత్యేక స్థానముంది. ఈ మండలంలోని చిరునోములకు చెందిన రావెళ్ల జానకిరామయ్య ''ఆంధ్రమహాసభ'' జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. సాయుధ తెలంగాణ ఉద్యమానికి ఇన్చార్జిగా పనిచేశారు. గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల, ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, సీతానగరం, బ్రాహ్మణపల్లికి చెందిన యువకులను ఉద్యమ కారులుగా తీర్చిదిద్దారు. వీరికి మరికొంతమంది యువకులు తోడై ఉద్యమ ఉధృతిని పెంచి.. నైజాంకు వెన్నులో వణుకుపుట్టించారు. నైజాంకు వ్యతిరేకంగా పోరు సల్పిన ఎంతో మంది యోధులను సైన్యం మట్టుపెట్టింది. ఆళ్లపాడుకు చెందిన యలమందల చంద్రయ్య, మంద అచ్చయ్య, వల్లాపురం వాసి గొర్రెబుచ్చుల అజరయ్య, సామినేని గోపయ్య, మడుపల్లి వీరస్వామి, రేపల్లెవాడకు చెందిన తమ్మినేని బుచ్చయ్యను రజాకార్లు చిత్రహింసలకు గురిచేశారు. గ్రామ వీధుల్లో తుపాకితో కాల్చిచంపారు. వీరి మృతదేహాలను గోవిందాపురం గ్రామంలో అందరూ చూస్తుండగా ఒకే చితిపై వేసి దహనం చేశారు. వీరి పోరాటానికి గుర్తుగా గోవిందాపురం గ్రామంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. ఒక్కొక్క వీరున్ని నైజాం మూఖలు మట్టుబెడుతున్నా ఉద్యమంలో ఒక్కరూ వెనుకడుగు వేయలేదు. ఉద్యమం మరింతగా ఎగిసిపడిందే తప్ప ఆగిపోలేదు.
సమరవల్లి... కుర్నవల్లి...
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులను కన్న గ్రామంగా తల్లాడ మండలం కుర్నవల్లి ఘనతికెక్కింది. ఈ గ్రామానికి చెందిన పలువురు నైజాం నవాబుకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం గావించారు. పారుపల్లి పుల్లయ్య, కొలికొండ రాఘవయ్య, బోడేపూడి సూరయ్య, బోడేపూడి బసవయ్య, బోడేపూడి శేషయ్య, బోడేపూడి పుల్లయ్య, బత్తుల సుబ్బయ్య, షేక్ మదార్‌సాహెబ్, ఈలపోరు గోపయ్య తదితరులు దళ సభ్యులుగా పనిచేశారు.
రుధిర.. మధిర
మధిర తాలూకాలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్ ప్రాంతాల్లోని చిలుకూరు, అల్లీనగరం గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకుని నిజాం ముష్కరులపై దాడులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో అల్లీనగరం, మడుపల్లి, ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామాలను రజాకార్లు తగులబెట్టారు. మీనవోలుకు చెందిన ఓ యువకుడు సైనికాధికారిని పొడిచి చంపడంతో గ్రామానికి చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా కాల్చిచంపారు. నాటి పోరాట యోధులను చైతన్య పరిచేందుకు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం అల్లీనగరం క్యాంప్‌నకు వచ్చారు. చిలుకూరు, గోసవీడు గ్రామాల నుంచి వందలాది మంది యువకులు వచ్చి మధిర మెయిన్‌రోడ్డులో నైజాం ముష్కరులను మట్టుబెట్టారు.
ఎందరో అమరులు...
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గన్న యోధుల్లో సుమారు 200 మంది ఉమ్మడి జిల్లా వాసులు నైజాం తూటాలకు బలయ్యారు. మధిర తాలూకా నుంచి 58 మంది, ఖమ్మం నుంచి 61, కొత్తగూడెం (పాల్వంచ) నుంచి 53 మంది, రజాకార్ల అతి బీభత్సకాలంలో 21 మంది అసువులు బాశారు. వీరిలో దళ కమాండర్లు, ఆర్గనైజర్లు, కార్మిక సంఘ నాయకులు మొదలు సామాన్యుల వరకూ ఉన్నారు. 20 ఏళ్ల లోపు యువకులు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకూ పోరు సల్పారు. నైజాం తూటాలను ఎదురొడ్డి నిలిచారు. ఇంకా ఎందరో ఏళ్లకు ఏళ్లు జైలు జీవితం గడిపారు. ''కమ్యూనిస్టు పార్టీయే నన్ను మనిషిని చేసింది' అన్న దాశరథి రంగాచార్య.. నాడునేడు పరిస్థితులను విశ్లేషిస్తూ ''జీవనయానం'' అనే పుస్తకంలో ''మాది త్యాగాల కాలం.. మీది భోగాల కాలం'' అని పేర్కొన్నారు. ''నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అన్న దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. దాశరథి సోదరులు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గార్లలో జన్మించినా ఖమ్మంతో వారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. అటు కృష్ణ, ఇటు వరంగల్, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఎందర్నో అక్కున చేర్చుకుని పోరు పథంలో నడిపించిన చరిత్ర రైతాంగ సాయుధ పోరాటందైతే.. అందునా ప్రత్యేకత గలది ఉమ్మడి ఖమ్మం జిల్లా.. నాటి జిల్లా వీరుల త్యాగాలకు గుర్తుగా రంగాచార్య 'మోదుగుపూలు' పుస్తకాన్ని రచించారు.
'సాయుధ' పోరును 'కాషాయ' వక్రీకరణ
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది. నిజాం రాజుకు వ్యతిరేక పోరాటంగా చిత్రీకరిస్తోంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాట యోధులున్న ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహించాలని నిర్ణ యించాం. దీనిలో భాగంగా వందకు పైగా సభలు నిర్వహించాం.