Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేసిన జేఏసీ నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని తక్షణమే సింగరేణి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె శనివారం నాటికి సమ్మే 9వ రోజుకు చేరుకున్న సందర్భంగా సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్ట్ కార్మికులు ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, పి.సతీష్, డి.నిర్మల, ఎల్.విశ్వనాథంలు కలసి డైరెక్టర్ (పా) ఎస్.చంద్రశేఖర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ శుక్రవారం నాడు హైదరాబాదు డిప్యూటీ సీఎల్‌సి వద్ద జరిగిన చర్చలలో యాజమాన్యం కొంత సానుకూలంగా వ్యవహరించినప్పటికీ వేతనాల మీద స్పష్టమైన హామీ రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. సింగరేణి యాజమాన్యం వేతనాల పెంపు విషయంలో మొండిగా వ్యవరిస్తున్నారని జేఏసీ నాయకులు విమర్శించారు. వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని, సింగరేణికి వచ్చే లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కీలకంగా ఉన్నప్పుడు ఎందుకు వేతనాలు పెంచరని ప్రశ్నించారు. పోటీ కార్మికులను పెట్టడం, షోకాజు నోటీసులు ఇచ్చి బెదిరింపులు వద్దని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, అందుకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇనుపనూరి నాగేశ్వరరావు, ఎం.చంద్రశేఖర్, జి.శ్యామ్ కుమార్, కృష్ణ, పి.రామచందర్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న, యూత్ కాంగ్రెస్ తరపున జి.రాజశేఖర్, పి.కోటేశ్వరరావు పాల్గొని మద్దతు తెలియజేశారు.