Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట
- పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు
- ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్ట్ భర్తీ చేయాలి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులు, అపరిశుభ్ర పరిసరాలు, దోమల వృద్ధి, కలుషిత నీరు వెరసి మండలంలో పిల్లల నుంచి పెద్దల వరకు వ్యాధులు ప్రబలుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఒంటి నొప్పులు, వైరల్ ఫీవర్లతో పాటు డెంగీ, టైఫాయిడ్, మలేరియా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోగుల తాకిడితో ప్రభుత్వ, గ్రామీణ వైద్యుల ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారికంగా మండలంలో 7 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ రక్త పరీక్షల కేంద్రాల్లో వీటి సంఖ్య ఎక్కవగానే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి మూడు నెలల క్రితం ప్రతిరోజూ వచ్చే పేషెంట్లు సుమారు కేసులు 50 నుంచి 60 దాకా ఉండేది. కానీ ఈ సెప్టెంబర్ నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ ఓపీ 120 నుంచి 150 వరకు ఉంటుంది. మండలంలో ఎక్కువగా రోగాలు, విష జ్వరాలు ప్రబలుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 7 పడకలు ఉండగా వాటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలానుగుణ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలోని ప్రభుత్వ, గ్రామీణ వైద్యుల ఆసుపత్రులకు బాధిత చిన్నారులతో తల్లిదండ్రులు వరస కడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారడానికి ముందు ఇన్ ఫెక్షన్ సులభంగా దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి పది మందిలో ఒకరికి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఇతర వైరల్ ఇన్ ఫెక్షన్ లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో వైరల్ ఇన్ ఫెక్షన్ లో ఫ్లూ జ్వరం ఒకటి, అనుమానిత డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వర బాధితులు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
42 టైఫాయిడ్ కేసులు నమోదు
మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు 1291 మందికి మలేరియా పరీక్షలు చేయగా 5 గురికి పాజిటివ్ వచ్చింది. ఇక కొంత మంది జ్వర అనుమానితులకు డెంగీ పరీక్షలు చేయగా 7 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. టైఫాయిడ్ 200 మంది అనుమానితులకు పరీక్షలు చేస్తే 42 మందికి టైఫాయిడ్ నిర్ధారణ అయింది. నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వందల సంఖ్యలో జనాలు విష జ్వరాలతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆసుపత్రి వైద్యాధికారి మండల పరిధిలోని సింగారం, పెద్దవెంకటాపురం, మర్కోడు, అనంతోగు, రాయిపాడు, తదితర గ్రామాల్లో, బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు విరివిగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో ఎక్కువగా వైరల్ ఫీవర్లు ఉన్నాయని, రోగాలు ప్రబలుతున్నాయి జనాలు జర జాగ్రత్త పడాలని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యుల్లో డిప్యూటేషన్‌లో ఒకరు ఇల్లందు వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరే వైద్యులు ఉన్నారు.
గత ఏడాది వర్షాకాల సీజన్లో మండలంలో డెంగీ, మలేరియా, రక్త కణాలు పడిపోవటం వంటి జ్వరాలతో పదుల సంఖ్యలో జనాలు మృతి చెందిన విషయం విదితమే. ఈ వర్షాకాలం సీజన్ జూలై 19న సింగారం గ్రామానికి చెందిన కోరం శైలజ (19) అనే యువతి మలేరియా జ్వరానికి సకాలంలో వైద్యం అందక కొత్తగూడెం ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్ట్ భర్తీ చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
పరిశుభ్రత పాటించాలి : - డాక్టర్ పి.సుధీర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి, ఆళ్ళపల్లి
ఇటీవల వరసగా వర్షాలు పడటం వల్ల దోమల వృద్ధి జరగకుండా కొట్టుకుపోయాయి. కానీ వారం రోజుల నుంచి ఎండలు పెరగడం వల్ల వైరస్ కు ఇమ్యూనిటీ పెరిగి మళ్లీ దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మనుషుల్లో ఒక్కసారిగా డీహైడ్రేషన్, ప్లేట్ లెట్స్ పడిపోవడం, విష జ్వరం బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరల వాడకం, సంపులు, డ్రమ్ములలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వేడి చేసి చల్లార్చిన నీరు తాగండంతో పాటు ఆహార పదార్థాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఆసుపత్రిలో కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాం.