Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ-పాల్వంచ
ఉద్యోగుల సామాజిక భద్రతకు మప్పుగా మారిన చందాతో కూడిన పింఛన్ పథకం (సిపిఎస్) ను రాష్ట్రంలో రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఆదివారం పాల్వంచలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.కిషోర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 2004లో అప్పటి బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సిపిఎస్ విధానాన్ని తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందని రవి విమర్శించారు. సిపిఎస్ పట్ల దేశవ్యాప్తంగా ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుందని, పరిస్థితి తీవ్రతను గమనించిన రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపైనా, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నందున, ఆ పోరాటంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అధారిటీ (పిఎఫ్ఆర్డిఎ) రద్దు డిమాండును కూడా చేర్చాలని సూచించారు. ముందుగా రాష్ట్రంలో సిపిఎస్ ను రద్దు చేసి దేశవ్యాప్త సిపిఎస్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాలని కోరారు. కేజిబివిల్లో గత ఆరునెలలుగా మెస్ బిల్లులు మంజూరు చేయడం లేదని, స్పెషల్ ఆఫీసర్లు తమకొచ్చే అరకొర నెల జీతాన్ని పిల్లల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కెజిబివి బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, నాయకులు ఎ నరసింహారావు, ఎం శ్రీనివాసరావు, ఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.