Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదృశ్యమై దొరికిన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని సంచలన ఆరోపణ
- కిడ్నాప్ కు సూత్రధారి వాచ్ మెన్, వంటమనిషి కాంతమ్మ..!
నవతెలంగాణ-బూర్గంపాడు
ఆశ్రమ పాఠశాలకు చెందిన వాచ్మెన్, వంట మనిషి కాంతమ్మ సహకారంతో నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని, ఆశ్రమ పాఠశాలలో అదృశ్యమై తిరిగి దొరికిన విద్యార్థిని మిడియం మేఘన సంచలన ఆరోపణ చేసింది. నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి కాంతమ్మ సూత్రధారి అని, కిడ్నాప్ చేసిన వారే మరలా తీసుకొచ్చి గదిలో తానను వదిలి వెళ్లారని మేఘన పేర్కొంది. బూర్గంపాడులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం మిడియం మేఘన, తన తల్లిదండ్రులు, పీడీఎస్యూ, ప్రజాపంథా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలిక మేఘన తన అదృశ్యంపై పలు ఆరోపణలు చేసింది. బుధవారం తనను వంటమనిషి కాంతమ్మ హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చి బిస్కట్లు కొనిచ్చిందని మేఘన పేర్కొంది. తనను నలుగురికి అప్పగించి వారితో కలిసి బయటకు వెళ్లాలని చెప్పడంతో తాను వారితో కలిసి వెళ్లానని... కొద్ది దూరం వెళ్ళాక తనను సంచిలో కుక్కి వేరే గ్రామానికి తీసుకెళ్లారని విద్యార్థిని మేఘన తెలిపింది. మరల గురువారం ఉదయం సమయంలో తనను హాస్టల్ కు తీసుకువచ్చి పై అంతస్తులోని గదిలో మంచాల మధ్యలో పడుకోబెట్టారని ఆరోపించింది. అనంతరం మేఘన తల్లిదండ్రులు ప్రజాపంథా నాయకులు ముద్దా భిక్షం మాట్లాడుతూ బాలిక అదృశ్యంపై అధికారులు సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి విద్యార్థిని మేఘన చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ సిబ్బందికి క్షుద్రపూజలు చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. విద్యార్థి మేఘనను కిడ్నాప్ చేసి క్షుద్రపూజలు చేసే ముఠాకు అమ్మాలని హాస్టల్ సిబ్బంది ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
వార్డెన్ ను సస్పెండ్ చేసిన ఐటీడీఏ పీఓ
విద్యార్థిని మిడియం మేఘన అదృశ్యం ఘటనలో బాధ్యురాలుగా చేస్తూ హాస్టల్ వార్డెన్ సునీతను సస్పెండ్ చేస్తూ భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయురాలు సామ్రాజ్యానికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.