Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ - వైరా టౌన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల త్యాగాలు మరువలేనివని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. వైరా మండలం ఖానాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన ఖానాపురం గ్రామానికి చెందిన కుక్కా వెంకటేశ్వర్లు, వేగంటి నారాయణ, వేగంటి జోగయ్య స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బొంతు రాంబాబు మాట్లాడుతూ కుక్కా వెంకటేశ్వర్లు, వేగంటి నారాయణ, వేగంటి జోగయ్య, తోట గోపయ్యలు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆనాడు బ్రిటిష్ పాలకులు, జమీందార్లు, జాగిరిదార్లకు వేతిరేకంగా పోరాడినారని, వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. వల్లాపురం గ్రామానికి చెందిన మద్ది రాములు, గొర్రెముచ్చు అజారయ్య దలసభ్యులు ఏడుగురుని గోవిందాపురం గ్రామంలో బతికి ఉండగానే చితి పేర్చి మంటలలో వేసి చంపి ప్రజలను బయబాత్రులు చేశారని, అయినప్పటికీ జనం ఉవ్వెత్తున లేచి బ్రిటీష్ వలస వాదులను జమీందార్ల, జాగిరిదార్లను పారద్రోలి తమ హక్కులను సాధించు కున్నారని అన్నారు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వారు సాధించిన హక్కుల కోసం మనం పోరాడితేనే నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు బాజోజు రమణ, తూము సుధాకర్, శాఖా కార్యదర్శి శీలం విష్ణువర్ధన్ రెడ్డి, సభ్యులు గాలి నరసింహారావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, తోట రాజ్జాలు, బాలరెడ్డి, ఉస్సేన్, సత్యనారాయణ, రామారావు, కోటేశ్వరరావు, సైదులు, శివాజీ, సుబ్బారావు, ఉస్సేన్, తోట క్రిష్ణవేణి, రాదా, రమాదేవి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.