Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూదందాలను ఉక్కుపాదంతో అణిచాం
- అభివృద్ధిలో దూసుకుపోతున్నాం...
- హ్యాట్రిక్ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా..
- అందరి స్ఫూర్తితో మరింత ముందుకెళ్తా...
- పౌర సన్మాన సభలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాను ముఖ్యంగా నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. భూదందాలను ఉక్కుపాదంతో అణచి ప్రశాంత ఖమ్మాన్ని నిర్మించామన్నారు. మంత్రిగా పువ్వాడ అజయ్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పౌర, స్వచ్ఛంద, కుల, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పౌరసన్మాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అందరి స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని, ఆదరాభిమానాలు తప్ప తాను ఎవరి నుంచి ఏ ఒక్కటీ ఆశించింది లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో నగరం నలుదిశలా అభివృద్ధి చెందింద న్నారు. భూ దందాలపై ఉక్కుపాదం మోపడంతో ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థలాలు కొనుగోలు చేసి ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. ఖమ్మానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా సీఎం మంజూరు చేశారన్నారు. ఖమ్మానికి నలుదిక్కులూ అభివృద్ధి చెందుతున్నా ఓవైపు మున్నేరు ఉండటం, కార్పొరేషన్ పరిధి కూడా దానిలోపే పరిమితం కావడంతో అటువైపు తప్ప మిగిలిన అన్నివైపులా నగరాన్ని విస్తరిస్తూ వెళ్తున్నామన్నారు. సెటిల్మెంట్లు, భూదందాలు ఇవేవీ లేకుండా అవినీతికి ఆమడదూరంలో ఉన్నామన్నారు. ఏ వర్గం నుంచి కూడా నా సొంతానికి ఒక్కపైసా ఆశించింది లేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అదే సంకల్పంతో ముందుకెళ్తుండగా కొందరు చిల్లరమల్లర గాళ్లు అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇవేవీ ఖాతారు చేయకుండా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నానన్నారు. ఓవైపు పార్టీ బలంగా ఉండటం...మరోవైపు తటస్థంగా ఉండే ఇన్ని వర్గాలు తన వెనుక ఉండగా భయపడాల్సిన అవసరం ఏముందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్, ముఖ్యమంత్రితో పాటు తానూహ్యాట్రిక్ విజయం సాధించడానికి అందరి ఆదరాభిమానాలు కావాలని ఆకాంక్షించారు.
- భారీ కార్ల ర్యాలీ...
భారీ కార్ల ర్యాలీతో మంత్రి పువ్వాడను సమావేశ మందిరానికి తీసుకొచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీచౌక్, కాల్వడ్డు, వైరారోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డులోని సమావేశ మందిరానికి చేరింది. గాంధీచౌక్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో గజమాలను మంత్రి మెడలో వేశారు. గిరిజన నృత్యాలతో స్వాగతం పలికారు. సన్మాన వేడుకలో భాగంగా వివిధ సంఘాల వారు మంత్రికి శాలువాలతో సన్మానం, జ్ఞాపికలు ఇచ్చారు. ఈ సన్మానోత్సవంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు చిన్ని కృష్ణారావు, గుడవర్తి శ్రీనివాసరావు, పత్తిపాక రమేష్, కురువెళ్ల లక్ష్మీకాంతారావు, బమ్మ రాజేశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.