Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
- ఉపాధ్యాయుల కొరతను అధిగమించాలి..
- టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షులు చావా దుర్గాభవాని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీ.వి.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం (సీపీఎస్) పట్ల దేశవ్యాప్తంగా ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపైనా, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో ముందుగా రాష్ట్రంలో సీపీఎస్ ను రద్దు చేసి దేశవ్యాప్త వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాలని కోరారు. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. పర్యవేక్షణ అధికారులు, మూడోవంతు ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్లు లేరని తెలిపారు. ప్రతి ఉన్నత పాఠశాలలో సగటున రెండు సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అర్హత గలిగిన ఉపాధ్యాయులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. యుయస్పీసీ పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మీనమేషాలు లెక్కించడం ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. జిఓ 317 అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను అనుమతించాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని , పెండింగ్ లో ఉన్న మూడు డిఎ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెజిబివిలకు గత ఆరునెలలుగా మెస్ బిల్లులు మంజూరు చేయడం లేదని, స్పెషల్ ఆఫీసర్లు తమకొచ్చే అరకొర నెల జీతాన్ని పిల్లల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కెజిబివి బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే విధమైన పనివేళలు అమలు చేయాలని, విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, మహాత్మా జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ అలవెన్సులు, ఉద్యోగుల కన్వేయన్స్ అలవెన్స్, ఇతర అలవెన్సులను పిఆర్సీ సిఫారసు మేరకు పెంచుతూ జిఓలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి నరసింహారావు, మహబూబ్ అలీ, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ. రాంబాబు, షేక్ రంజాన్, నరసయ్య ,మంగీలాల్, సురేష్, సతీష్, లక్ష్మణరావు, రమేష్ ,లివింగ్ స్టన్ , నాగరాజు, లక్ష్మీకుమారి, రోజా, కస్తూరిబాయి పాల్గొన్నారు.