Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- కల్లూరు
నైజాంను మించి అరాచకాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్ అన్నారు. శనివారం రాత్రి కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి, తాళ్లూరు, వెంకటాపురం గ్రామాల్లో జరిగిన సాయుధ పోరాట రైతాంగ వారోత్సవాల సందర్భంగా జరిగిన సభలలో వారు మాట్లాడుతూ రజాకారులను మించి బిజెపి దోపిడీ పాలన కొనసాగుతుందని, నిజాం దొరలకు దోచిపెడితే నరేంద్ర మోడీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడన్నారు. తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ చరిత్రను వక్రీకరించి బిజెపి హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. భూమి కోసం ముక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో భాగంగా 4వేల మంది కమ్యూనిస్టులు ప్రాణార్పణ కావించారన్నారు. వీరిలో కల్లూరు మండలం చింతలపూడి జగ్గయ్య, దోమతోటి పకీర్ వంటి నాయకులు ప్రాణార్పణ గావించారన్నారు. దోమతోటి పుల్లయ్య, సోమభక్తిని కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు తన్నీరు కృష్ణార్జునురావు, సామినేని హనుమయ్య, తిగుళ్ల బాబు, మనమంటి వెంకటి, బట్టు నరసింహారావు, నాయుడు చందర్రావు, చింతలపూడి పురుషోత్తం, బట్టు నరసింహారావు, బీరవెల్లి బాబు, బీరవెల్లి రవీంద్ర, తాళ్ల వెంకటి, మోదుగు వెంకయ్య పాల్గొన్నారు.
మోటార్ సైకిల్ ర్యాలీ
ఖమ్మం (ఖమ్మంరూరల్) : ఖమ్మంరూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మరించుకుంటూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత గంగవరపు శ్రీనివాసరావు స్తూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏపూరి వరకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం మండల కార్యదర్శి, గ్రామ ఎంపీటీసీ నండ్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎం వెంకటాయపాలెంలో అమరజీవి గంగవరపు శ్రీనివాసరావు, శివయ్య, చంద్రయ్య, చిన్నమలసూర్, పెద్దమలసూర్ అనేకమంది పార్టీ కార్యకర్తలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వడ్లమూడి నాగేశ్వరరావు, సేవా నాగేశ్వరరావు, కొట్టే రామయ్య, మునిగంటి వెంకటేశ్వర్లు, నిదిగొండ వెంకటేశ్వర్లు, సిరిసివ్వాడ మల్లికార్జున్, కూసు సంజీవరెడ్డి, వడ్లమూడి మల్లయ్య, రామగిరి నాగరాజు, తేనే సూరిబాబు, నేరెళ్ల ఉపేందర్, బాలిన నాగేశ్వరరావు, కొలీశలం కృష్ణ, రెంటాల నాగేశ్వరరావు, నేరెళ్ల ఉపేందర్, బేతంపూడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ భూములు పేదలకు పంచాలి : సీపీఐ(ఎం)
వేంసూరు : కందుకూరు వెంకటేశ్వరస్వామి దేవాలయ భూములను సాగు భూములు లేని నిరుపేదలకు పంచాలని సీపీఎం మండల కార్యదర్శి అరవపల్లి జగన్ మోహన్‌రావు, కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్‌లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దుద్దేపూడి గ్రామ సీపీఎం, సీఐటీయూల ఆధ్వర్యంలో గ్రామ సీపీఎం కార్యదర్శి చీపి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభలో మల్లూరు మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పుణికి పుచ్చుకొని గతంలో కందుకూరు దేవాలయ భూములను నాటి ఆంధ్ర భూస్వాముల చెర నుండి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడి జైలుకు వెళ్లి 20 ఏళ్ల పాటు కోర్టులకు తిరిగిన సందర్భాలు ఉన్నాయని, పేదలకు అనుకూలంగా వుండే ధరలకు దేవాలయ భూములు కౌలు పాటలు పాడే విధానాన్ని పోరాడి తీసుకువస్తే నేటి పాలకులు, అధికారులు పేదలకు అనుకూలంగా వుండే ధరలు లేకుండా పేదలకు దేవాలయ భూములు దక్కకుండా అందని ద్రాక్షలాగా మారుస్తూ అధిక ధరలను పెట్టి తిరిగి భూస్వాములకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దున్నే వానికే భూమి దక్కేలా మరో పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని అన్నారు. ముందుగా సీపీఎం జెండాను సీనియర్ నాయకులు గుంట్రు జాన్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో కొచ్చర్ల సుందరం, కంటే గోపాలం, సుగుణరావు, గుర్రం శ్రీను, నేరెళ్ల వెంకటేశ్వరరావు, మాధవరావు, మహేష్ పాల్గొన్నారు.
రజాకార్లను తిప్పి కొట్టిన ఘనత కమ్యూనిస్టులదే
తిరుమలాయపాలెం : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడి ఆనాటి ఉద్యమం వెట్టి చాకిరి విముక్తి కోసం 1946లో ప్రారంభమైన ఉద్యమం 1952 వరకు కొనసాగిందని, ఆనాటి పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు రజాకార్లకు వ్యతిరేకంగా జమీందారులను తరిమికొట్టి పది లక్షల ఎకరాలను భూమిని పంచింది ఎర్రజెండాలే అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. శనివారం రాత్రి సుబ్లేడ్‌లో తెలంగాణ సాయుధ పోరాటాల ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు వశపొంగు వీరన్న అధ్యక్షత వహించారు. ముందుగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి పూలమాలేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, అంగిరేకుల నరసయ్య, తుళ్లూరు నాగేశ్వరరావు, బింగి రమేష్, ఎస్డి జియావుద్దీన్, తంగెళ్ల రమేష్, దుంపటి వీరేష్, లింగంపల్లి రమేష్, మోటపోతుల శ్రీను, కోట ఉపేందర్‌రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సదానందం తదితరులు పాల్గొన్నారు.