Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం కుట్రలను తిప్పికొడుతూ హక్కుల కోసం పోరాటం
- అతి త్వరలో మెరుగైన పీఆర్సీ ఇప్పిస్తాం...
- ఏకగ్రీవంగా టీఎస్‌ఈఈయూ- 327 జిల్లా కార్యవర్గం
- అధ్యక్ష, కార్యదర్శులుగా సత్యనారాయణరెడ్డి, సీతారాంగోపాల్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్‌రంగ సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలని ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (రిజిస్టర్ నం:327) రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూనే హక్కుల కోసం పోరాడుదామని కోరారు. రెండేళ్ల కాలపరిమితితో కూడిన యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని స్థానిక వీడీవోస్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీధర్ మాట్లాడారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పెన్షన్ విధానం కల్పిస్తామన్నారు. ప్రమోషన్లు వెంటనే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టిజెన్స్ వర్కర్స్‌కి మెరుగైన పీఆర్సీ, అన్మ్యాన్డ్ వర్కర్స్‌ను ఆర్టిజెన్స్గా గుర్తించేందుకు పోరాడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే విద్యుత్ సవరణ చట్టం-2022ను తీసుకొచ్చిందన్నారు. కార్మికుల పోరాట ఫలితంగా తాత్కాలికంగా దానిని వెనక్కి తీసుకున్నా ఇప్పటికీ దీని ప్రమాదం పొంచే ఉందన్నారు. దీని ప్రభావం విద్యుత్‌రంగ ఉద్యోగులపైనే కాక రైతులు, పేద, మధ్యతరగతి, విద్యుత్ వినయోగదారులందరిపైనా ఉంటుందన్నారు. పెట్రో రేట్ల తరహాలో భవిష్యత్‌లో విద్యుత్ బిల్లులు కూడా విచ్చలవిడిగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సంఘటితంగా ప్రతిఘటించి విద్యుత్ ప్రయివేటీకరణను నిలుపు చేయకపోతే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగ సంస్థ మరింతగా దెబ్బతింటుందన్నారు. గతంలో 30, 31 తేదీల్లో వేతనాలు తీసుకున్న మనం ఇప్పుడు శాలరీ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షనీయమని పేర్కొన్నారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం ఈ కుటిలయత్నాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర సహకారంతో ఈ ఇద్దరు కార్పొరేట్లు ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఎదుగుతున్నారన్నారు. గుజరాత్‌కు చెందిన అదానీ ప్రపంచంలోనే మూడో కుబేరుడిగా ఎదిగాడంటే కేంద్రం ఎంతగా కార్పొరేట్లకు తోడ్పాటు నిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధ్యక్ష, కార్యదర్శులు పి.మహేందర్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు, కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి, ఖమ్మం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గాదె మోహన్‌రెడ్డి, ముఖ్య సలహాదారు మందడపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా సత్యనారాయణరెడ్డి, సీతారాంగోపాల్
ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (రిజిస్టర్ నంబర్ 327) ఖమ్మం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా మందపాటి సత్యనారాయణరెడ్డి, ఊటుకూరు సీతారాంగోపాల్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అనిశెట్టి రవికుమార్, కోశాధికారిగా రామిశెట్టి సత్యనారాయణ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.