Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచినీటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీ ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
ఎన్నడూ లేని విధంగా 30 ఏండ్ల కాలంలో గోదావరి ఉధృతి పరివాహక ప్రాంత గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జూలై 9 నుండి 29 వరకు సుమారు 72 అడుగులు ఎత్తున గోదావరి వరద ప్రవహించడంతో ఆ ప్రభావంతో 27 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయిగూడెం వద్ద ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ ఇన్‌టెక్‌వెల్ ముంపుకు గురయింది. సుమారు పదిహేను రోజుల పాటు ముంపుకు గురై నీటిలోనే ఉండిపోయింది. తీవ్ర వరద కారణంగా ఇన్‌టెక్‌వెల్ అంతర్భాగంలోకి అధిక బురద చేరడంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. సుమారు 8.5 అడుగులు ఒండ్రు చేరడంతో నీరు నిల్వ ఉండలేక పోతుంది. స్థానిక కార్మికులకు సాధ్యం కాకపోవడంతో విశాఖపట్నం నుండి యంత్రాలు, నిపుణులను తీసుకొస్తున్నారని చెప్తున్నారు కానీ ఎక్కడ పనిచేసినట్లు కనిపించడం లేదని మున్సిపాలిటీ వాసులు వాపోతున్నారు. ఇన్‌టెక్‌వెల్‌కు వెళ్ళే రహదారి పూర్తిగా ధ్వంసం అయిందని, రహదారి లేని కారణంగానే ఒండ్రు తవ్వించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు చొరవ చూపి సింగరేణి అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తే సమస్య తీవ్రంగా ఉండేది కాదంటున్నారు. సింగరేణి వద్ద సిల్ట్ తొలగించే యంత్రాలు ఉన్నప్పటికీ ఆ దిశగా మున్సిపాలీటీ అధికారులు ప్రయత్నించకపోవడం విచారకరం. దసరా నాటికి అయినా మంచినీటి సమస్య తీరుతుందా లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా జూలై 9 నుండి సెప్టెంబర్ వరకు మంచినీటి సరఫరాలో అంతరా యం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితిని సవరించి మంచినీరు అందించాల్సిన అధికారులకు ముందు చూపులేకపోవడంతో పట్టణంలో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వినాయకచవితి సందర్భంగా నీరు లేక మున్సిపాలీటీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. బండారుగూడెం, సుందరయ్యనగర్, మేదరబస్తీ, శేషగిరినగర్, భగత్‌సింగ్‌నగర్, శ్రీశ్రీ నగర్, ఆదర్స్‌నగర్, శివలింగాపురం, మణుగూరు, బాపనకుంట మొత్తం 20 వార్డులలోని 8 వార్డులలో సింగరేణి సరఫరా చేసే నీరు అరకొరకగా వస్తున్నాయి. మిగతా 12 వార్డులలో పూర్తిగా నీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ద ప్రాతిపదికనా ఇన్‌టెక్‌వెల్ సిల్ట్ తొలగించి మున్సిపాలిటీ ప్రజల దాహర్తిని తీర్చాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నారు.