Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలు నేల పాలు కాకుండా బకెట్ ఏర్పాటు
- నాయకుల లోభి తనం తెలిపిన ఓ ఐడియా
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనే యాడ్‌ను అనుసరించిన నాయకులకు వారు అమలు చేసిన ఓ ఐడియా ఆ నాయకుల లోభి తనాన్నే బయట పెట్టింది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ నూతన పథకాలు ప్రకటనలను హర్షిస్తూ వారి చిత్రపటాలు ప్లెక్సీలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతా భావం, అభిమానం ప్రదర్శించు కోవడం సర్వసాధారణమే. అందుకు గానూ లీటర్ల కొద్ది పాలను వెచ్చించి అవి నేలపాలు చేయడం చిత్రం కాదు. కానీ పాలాభిషేకం తంతు లోనూ పాలను వృధా కానివ్వకుండా పొదుపు చర్యలు పాటించడమే ఇక్కడ విచిత్రం. ఈ చిత్ర విచిత్రంతో అశ్వారావుపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ఔరా అనిపించారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రతిపాదనతో గిరిజన బంధు పధకం తెస్తామని ప్రకటించడంతో రెండు రోజులుగా టీఆర్ఎస్ శ్రేణులు ఈ పాలాభిషేకాలుకు తెరలేపింది. సోమవారం వినాయకపురంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ సత్యవతి నేతృత్వంలో ముఖ్య అతిధిగా ఎంపీపీ శ్రీరామమూర్తి పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ల చిత్రపటాలు ఉన్న ప్లెక్సీలు పై పోసిన పాలనే తిరిగి వాడుతూ పలుమార్లు పాలాభిషేకం చేయడం విశేషం.
అందుకు అమలు చేసిన పొదుపు చిట్కా అబ్బుర పరుస్తుంది. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ పై పోసే పాలు నేల పాలు అవకుండా కింద బకెట్‌ను పెట్టారు. ఆ బకెట్‌లోని పాలను తిరిగి మిగతావారు పాలాభిషేకం చేశారు.