Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటేటా తగ్గుతున్న పప్పు పంటల సాగు విస్తీర్ణం
- ఎకరానికి రూ.12వేలు పెట్టుబడి... వచ్చేది దానిలో సగమే..
- అధిక వర్షాలు..మద్దతు ధర.. ప్రోత్సాహకాలు లేకపోవడమే కారణం
- ఖమ్మం జిల్లాలోనే గతేడాదితో పోల్చితే రెండింతలు తగ్గిన సాగు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కారణాలేవైనా ఆహారపంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోతోంది. వాణిజ్య పంటల వైపు రైతాంగం మొగ్గుచూపుతోంది. ఏటేటా అపరాల పంటలు ఆదరణ కోల్పోతున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2021లో పెసర, కంది కలిపి 21,089 ఎకరాల్లో సేద్యం చేయగా ఈ ఏడాది కేవలం 7,993 ఎకరాల్లోనే ఈ పంటలు సాగు చేయడం ఆహారధాన్యాల కొరతకు సంకేతంగా చెప్పవచ్చు. ఆహార పంటలతో పోల్చితే వాణిజ్య పంటల సాగు మెరుగ్గా ఉండటంతో ఈ పంటల వైపు రైతాంగం మొగ్గుచూపుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అపరాల సాగు విస్తీర్ణం రెండింతలు తగ్గింది. గతేడాది కొణిజర్ల మండలంలో ఐదువేల ఎకరాలకు పైగా అపరాల పంటలు సాగు చేశారు. పెసర 4,989, కంది 85 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది ఈ రెండు పంటలు కలిపి రెండువేల ఎకరాల లోపే సేద్యం చేశారు. కంది కేవలం 12 ఎకరాల్లోనే వేశారు. గతేడాది చింతకాని మండలంలో 5,555 ఎకరాల్లో పెసర సాగు చేయగా ఈ ఏడాది కేవలం 17 ఎకరాల్లోనే ఈ పంటను సేద్యం చేశారంటే అపరాల పంటలపై రైతులు ఎంతగా నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
గణనీయంగా తగ్గుతున్న సాగు
ప్రస్తుత సీజన్లో పెసర సాగు లక్ష్యం 25వేల ఎకరాలుగ కాగా దానిలో నాల్గో వంతు 6,889 ఎకరాల్లోనే సేద్యం చేశారు. 2020. 2021 సంవత్సరాల్లో వానకాలం సీజన్లో సాగు చేసిన పెసర పంట అధిక వర్షాలకు తుడిచిపెట్టుకుపోయింది. జూన్ ఆరంభంలో పెసర విత్తనాలు నాటితే ఆగష్టులో పంట చేతికొస్తుంది. అదే సమయంలో గత మూడు, నాలుగేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. 2020 సంవత్సరంలో 24,664 ఎకరాలు, 2021లో 18,156 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. సాగు సమయం ఎక్కువగా ఉండటం, ఆశించిన దిగుబడి కూడా లేకపోవడంతో ఏటా కంది విస్తీర్ణం కూడా తగ్గుతోంది. 2020లో 5,344 ఎకరాల్లో సేద్యం చేయగా 2021లో 2,933, ఈ ఏడాది ఏకపంటగా 232 ఎకరాలు, అంతర పంటగా 892 ఎకరాల్లో సేద్యం చేశారు.
ఎందుకిలా...?
ఏటేటా పప్పు పంటల సాగు విస్తీర్ణం పడిపోవడానికి ప్రధాన కారణం పంట నష్టపరిహారం రాకపోవడం, పంటకు ఆశించిన ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడులు గణనీయంగా పడిపోతుండటం, కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి తలెత్తుతుండటమే సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు. క్వింటాళ్లు పెసలు పండించేందుకు ఎకరానికి రూ.12వేలకు పైగా పెట్టుబడి అవుతుండగా పంట మంచిగా పండితే ఎకరానికి నాలుగు పుట్ల (8 క్వింటాళ్లు) దిగుబడి వస్తుంది. కాని ప్రస్తుతం ఎకరానికి క్వింటా దిగుబడి మాత్రమే వచ్చిందని రైతాంగం వాపోతోంది. ఎకరానికి రూ.12వేలకు పైగా పెసర రైతు పెట్టుబడి పెడితే అతనికి వచ్చే ఆదాయం దానిలో సగం మాత్రమే కావడంతో రైతాంగం అపరాల సాగుపై ఆసక్తి చూపించట్లేదు. గతేడాది క్వింటాల్ పెసలు రూ.7,275, కందులు రూ.6,300 పలుకగా సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పెసలు గరిష్ట ధర 6,700, కందులు 6,200 మాత్రమే పలికాయి. ఈ ఏడాది పెసర పంటలో ఎడతెరపి లేని ముసుర్ల కారణంగా గడ్డి విపరీతంగా పెరిగింది. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టే అవకాశం లేకపోవడంతో పచ్చ, లద్దె పురుగుల వ్యాప్తి పెరిగింది. పంట చివరి దశలో బంతు పురుగు కూడా వ్యాప్తి చెందింది.
పెట్టుబడులూ పూడట్లే.. వచ్చేయేడు వేయా...
చిట్టెపురెడ్డి వెంకటరెడ్డి, మేడిదపల్లి, తిరుమలాయపాలెం
ప్రతియేటా ఏడెనిమిది ఎకరాలు పెసర వేస్తా. పోయినేడు, ఈఏడు విపరీతంగా వానలస్తున్నాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు పుట్లు పండుతాయి. కానీ ఏడెనిమిది ఎకరాల పేరుమీద నాకు ఈ ఏడు ఒక పుట్టి దిగుబడి వచ్చింది. అంటే ఎనిమిది క్వింటాళ్లు. పంటకు నేను పెట్టిన పెట్టుబడి మిషన్ కూళ్లు కాక రూ.లక్షకు పైనే. పంట అమ్మితే క్వింటాల్ రూ.7వేలు పలికినా నాకు రూ.56వేలు మాత్రమే వస్తాయి. ఎనిమిదెకరాలకు కలిపి మొత్తం పంట మీద దున్నుడు కూళ్లు రూ.40వేలు, పురుగుమందులకు రూ.30వేలు, ఎదపెట్టినందుకు రూ.1,500, పంట దూసినందుకు మిషన్ కూళ్లు ఎకరానికి రూ.3000 వరకూ అడుగుతున్నారు. ఇక నాకు మిగిలేది ఎక్కడ. పంట సమయంలో అధిక వర్షాలకు దెబ్బతింటోంది. ప్రతియేటా పరిహారం ఇప్పిస్తామని అధికారులు వచ్చి రాసుకొని పోతున్నారు. ఇప్పటికీ మూడేళ్లయినా పైసా ఇవ్వలేదు. మా ఊళ్లో పోయిన సంవత్సరం 120 ఎకరాల వరకూ వేశారు. ముసురుబెట్టి 40 ఎకరాల దాకా పోయినవి. ఈ ఏడాది 80 ఎకాలు వేశారు. దీనిలో40 ఎకరాలు వానలకు దెబ్బతిన్నాయి. ఎవరూ చూడు వచ్చే సంవత్సరం వేయమని అంటున్నారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరుగుతున్నాయి తప్పితే మద్దతు ధరలు మాత్రం పెరగట్లేదు.