Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు చర్యలు చేపట్టాలి
- టెలి కాన్ఫెరెన్స్‌లో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పోడు సాగు దారులందరికీ పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాద అజరుకుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాదు నుండి పోడుదారులకు పట్టాలు జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 140 పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు పట్టాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 10 లక్షల 13 వేల ఎకరాలు అటవీ భూములున్నాయని, వాటిలో 2 లక్షల 29 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు చెప్పారు. గతంలో 85 ఎకరాలకు ఆర్ఎఎస్ఆర్ హక్కు పట్టాలుజారీ చేసినట్లు వివరించారు. గత సంవత్సరం నవంబర్ నెలలో హాబిటేషన్లు వారిగా క్లెయిమ్స్ స్వీకరించినట్లు చెప్పారు.
అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.....గతంలో ఆర్ఎఎస్ఆర్ హక్కు పత్రాలు జారీ చేసిన రైతులకు అటవీ అధికారుల అభ్యంతరాల వల్ల నూతన పట్టాలు జారీ చేయడం లేదని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోడు హక్కు పత్రాలు తీసుకున్న వారిలో మరణించిన రైతు కుటుంబ సభ్యులకు సక్సేషన్ చేయాలని సూచించారు.
జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య మాట్లాడుతూ...విచారణ కమిటీలు అర్హులకు పోడు పట్టాలు జారీ చేయాలని చెప్పారు. విచారణ ప్రక్రియ క్షేత్రస్థాయి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కువ ఎకరాల్లో పోడు భూములున్నాయని, క్షేత్రస్థాయిలోవిచారణ ప్రక్రియ సజావుగా నిర్వహించే విధంగా సిబ్బందికి తగు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ....పోడు సమస్య పరిష్కారానికి హాబిటేషన్లు వారిగా వచ్చిన ధరఖాస్తులు ఆధారంగా క్షత్రస్థాయిలో నిర్వహించు విచారణ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. విచారణ ప్రక్రియ నిర్వహణపై హాబిటేషన్లు, గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ...గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఐటిడిఏ పరిధిలో ఉన్నాయని అక్కడి ప్రజల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. గతంలో పోడు హక్కు పత్రాలు పొందిన భూములు ప్రస్తుతం అటవీ భూములుగా నమోదై ఉన్నాయని, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ...జిల్లాలో 332 గ్రామ పంచాయతీల పరిధిలోని 726 హాబిటేషన్లులో పోడు సమస్య పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. గత సంవత్సరం నవంబర్ నెలలో పోడు సమస్య పరిష్కారానికి ఆవాసాల వారిగా స్వీకరించిన దరఖాస్తుల్లో అశ్వారావుపేట నియోజకర్గ పరిధిలో 17,727, భద్రాచలం నియోజక వర్గ పరిధిలో 10,73:2, కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో 9,268, పినపాక నియోజకవర్గ పరిధిలో 29,217, వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడు మండలంలో 2,497, ఇల్లందు నియోజకవర్గంలో 14,222 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గాల వారిగా స్వీకరించిన దరఖాస్తులు ఆన్లైన్లో నిక్షిప్తం చేసి బద్రపరిచినట్లు వివరించారు. గతంలో ఐటిడిఏ పరిధిలో ఉండి నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి ఇతర జిల్లాల పరిధిలో ఉన్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హాబిటేషన్లు వారిగా షెడ్యూలు తయారు చేసి గ్రామ పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో టీములు ఏర్పాటు చేసి విచారణ ప్రక్రియ నిర్వహణకు సంసిద్ధంగా ఉంటామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, మెచ్చా నాగేశ్వరావు, ఐటిడిఏ పీఓ గౌతం, జిల్లా అటవీ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, డిఆర్ఓ అశోకచక్రవర్తి, ఆర్టీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.