Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ములకలపల్లి
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుందని, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉంటూ స్థానికంగా సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఆర్డబ్ల్యుఎస్ అధికారులకు సూచించారు. మండల పరిధిలోని జగన్నాధపురం ప్రధాన సెంటర్లో గత 10 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మంగళవారం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఆ సమయంలో ఇటుగా వచ్చిన ఎమ్మెల్యే మెచ్చా వారిని చూసి ఆగడంతో మహిళలు తమ గోడును ఎమ్మెల్యే ఎదుట వెలిబుచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ పదిరోజులుగా తాగునీటి సమస్య ఉంటే ఏంచేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. స్థానిక అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉందని, సమస్య తలెత్తిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ సమస్యను పరిష్కరిం చాలని హెచ్చరించారు. తక్షణమే గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వరప్రసాద్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.