Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెను నివారించండి
- అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి వ్యాపితంగా కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైందికాదని, తక్షణమే కార్మికుల డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు సింగరేణిత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ మంగళవారం జరిగిన రాజకీయపక్షాల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, జిల్లా నాయకులు ఎల్.విశ్వనాధం, ప్రజాపంథా జిల్లా నాయకులు మాచర్ల సత్యం మాట్లాడారు. సమ్మె నోటీసుపై కార్మిక శాఖ అధికారి సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన అధికారులు ఆ హామీని విస్మరించి నిరవధిక సమ్మెకు కారకులయ్యారని విమర్శించారు. హైపర్ కమిటీ సూచించిన వేతనాలను కోల్ ఇండియాలో అమలు చేస్తుంటే సింగరేణి యాజమాన్యం వేతనాలు పెంచకుండా శ్రమదోపిడికి పాల్పడుతోందన్నారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతూ జారీ చేసిన వేతన పెంపు జివో 22, 60 సింగరేణి కార్మికులకు వర్తించదా అని ప్రశ్నించారు. డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో కార్మికులకు అండగా ఉద్యమాలు చేపడతామని అవసరమైతే సమ్మె ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి యాజమాన్యానికి, ప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో రాజకీయపక్షాలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పక్షాన చేపట్టే దశలవారి ఆందోళనా, పోరాటాలకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఏజె.రమేష్, న్యూడెమోక్రసి నాయకులు కందగట్ల సురేందర్, ఎండి.ఉమర్, సీపీఐ నాయకులు ఘంటాడి కోటేశ్వర్రావు, పిడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.