Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచిన పనిభారాలు వెంటనే తగ్గించాలి
- ఆర్టీసి ఎస్డబ్ల్యుఎఫ్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశంలో సీఐటీయు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు కార్మిక సంఘాల కార్యకలాపాలను వెంటనే అనుమతించాలని, ఉద్యోగులకు అమలు చేయాల్సిన రెండు వేతన సవరణలను నిర్ణయించి వెంటనే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల కేంద్రం(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే మోటార్ వెహికల్ యాక్ట్ సవరణలను, కార్మిక వర్గానికి నష్టదాకమైన లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్న విషయాన్ని కార్మికవర్గం గమనించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్న సమస్యలన్నీ ప్రభుత్వాలు అనుసరిస్తున విధానాల వల్లనే వస్తున్నాయన్నారు. ప్రజా రవాణాను విస్తృతత పరిచి అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్టీసీకి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతి లేదనే సాకుతో యాజమాన్యం కార్మికులపై విపరీతమైన పని భారాలు పెంచుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం వెంటనే ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతించాలని, కార్మికులపై పెంచిన తీవ్రమైన పనిభారాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు అమలు చేయాల్సిన 2017 , 2021 వేతన సవరణలు, ఆరు డిఏలు, గత వేతన సవరణ బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్ , సిసియస్ బకాయిలు,రిటైరైన కార్మికులు ఏరకమైన ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఉత్త చేతులతో ఇంటికి పంపడం లాంటి దుస్థితి మారాలంటే ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సిఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఇస్తున్న పిలుపులని జయప్రదం చేయాలని కోరారు.యాజమాన్యం ముందుకు తెచ్చిన విఆర్ఎస్ ప్రతిపాదనలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌గా మన రూపొందించిన వీడియో ఆర్టీసీ కార్మికులను విశేషంగా ప్రభావితం చేసిందన్నారు. కార్మికుల అనేక అనుమానాలను ఆ వీడియో నివృత్తి చేసిందన్నారు. రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఆమోదించిన కర్తవ్యాలను అన్ని స్థాయిల కమిటీలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు మన్నెం నర్సిరెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్, సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు వర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ట్ర కార్యదర్శి జే.పద్మావతి, రీజియన్ నాయకులు వేము జాకబ్, చింతలచెరువు వెంకట కృష్ణారెడ్డి, కే.వెంకన్న కురవటి ప్రతాప్ తోకల బాబు తదితరులు పాల్గొన్నారు.