Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశం
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలో చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. కురవి నుండి కోదాడ వరకు ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నేలకొండపల్లి మండలం జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. మండల సరిహద్దు గ్రామం పైనంపల్లి వద్ద రహదారి, బ్రిడ్జి నిర్మాణ పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి, బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అంటూ అధికారులను ప్రశ్నించారు. రహదారి నిర్మాణ పనుల విషయంలో అధికారులు చెప్పేదానికి తగినట్టుగా పనుల పురోగతి ఉండాలన్నారు. రహదారి నిర్మాణ పనుల విషయమై తాను చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో పనులు కొనసాగింపు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉంటే సహించేది లేదన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ మధుసూదన్, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఆదాని కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, పవర్ మెక్ కంపెనీ మేనేజర్ సత్యనారాయణ, తహసిల్దార్ ధారా ప్రసాద్, ఎంపీడీవో కే జమలారెడ్డి, ఎంపీఓ శివ, ఎన్ ఎస్ పి ఈఈ సమ్మిరెడ్డి, డిఈ మన్మధరావు, జేఈఈ రత్నగీత, ఈజీఎస్ ఏపీవో ఆర్ సునీత, తదితరులు ఉన్నారు.
ముదిగొండ : జాతీయ రహదారుల (నేషనల్ హైవే) ముదిగొండ,న్యూలక్ష్మీపురం మధ్య నిర్మాణం జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా రహదారి నిర్మాణం జరుగుతున్న పనుల ప్రాంతంలో పర్యటించి ఆయన నిశితంగా పరిశీలించారు.అనంతరం రోడ్డు నిర్మాణంలో భూమి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రైతుల ఖాతాలో జమ చేశారా,పెండింగులో ఏమైనా ఉన్నాయా..అని తాసిల్దార్ శిరీషను ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న భూమి రైతుల నష్టపరిహారాన్ని రైతులకు అందించే విధంగా చర్యల చేపట్టాలని ఆయన తాసిల్దార్ శిరీషను ఆదేశించారు. రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించాలని, త్వరతిగతిన రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్, తాసిల్దార్ జి.శిరీష, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి.సూర్యనారాయణ, ఆర్ఐ ఎస్కే వహీదా, ఆర్అండ్బి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.